రాజ్ ఖోవాపై సుప్రీం ధర్మాగ్రహం ఇదే..

Update: 2016-07-14 04:10 GMT
‘కీ’ ఇచ్చే ఆడే బొమ్మలా గవర్నర్ వ్యవహరించకూడదన్న విషయం దేశంలోని మిగిలిన గవర్నర్లకు తాజాగా మరింత బాగా అర్థమై ఉండాలి. వ్యవస్థకు ధర్మకర్తలుగా ఉండాలే తప్పించి.. తమకు పదవులిచ్చిన వారికి విధేయులుగా వ్యవహరిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటూ అవమానాలు.. ఎదురు దెబ్బలు తప్పవన్న విషయం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్ ఖోవా ఉదంతం మరోసారి స్పష్టం చేస్తుందని చెప్పాలి. అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజ్యాంగ సంక్షోభాన్ని ‘పై వారి ఆదేశాలకు’ అనుగుణంగా వ్యవహరించిన రాజ్ ఖోవా  తాజాగా సుప్రీం నుంచి ఘాటు వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నారు.

చట్టం దృష్టిలో.. న్యాయస్థానాల కోణంలో చూసినప్పుడు అరుణాచల్ రాజ్యాంగ సంక్షోభానికి సంబంధించి తీసుకున్న అన్ని నిర్ణయాలు గవర్నర్ కు సంబంధించినవే మాత్రమే. మరెవరికీ ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లే ఉంటుంది. అయితే.. గవర్నర్ ఎవరు చెబితే అలా వ్యవహరించారన్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. చట్టం.. న్యాయం ఆ విషయాల్ని పట్టించుకోదు. ఇక.. అరుణాచల్ ప్రదేశ్ ఎపిసోడ్ ను చూస్తే.. గత ఏడాది గవర్నర్ రాజ్ ఖోవా తీసుకున్న నిర్ణయాల్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు.. తన 331 పేజీల తీర్పును వెలువరించే క్రమంలో గవర్నర్ తీరును స్పష్టంగా ఆక్షేపించింది.

‘గడియారాన్ని వెనక్కి తిప్పండి’ అంటూ అనూహ్య వ్యాఖ్యను చేయటమే కాదు.. రాజకీయ గందరగోళంలో గవర్నర్ స్వయంగా పాలు పంచుకోరాదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘‘రాజకీయ గందరగోళంలో స్వయంగా పాలు పంచుకోవటం గవర్నర్ పని కాదు. ఒక రాజకీయ పార్టీలో ఉండే అభిప్రాయ భేదాలు.. అసంతృప్తులకు గవర్నర్ దూరంగా ఉండాలి. రాజకీయ బేరసారాలకు.. నైతికంగా ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలకు గవర్నర్ దూరంగా ఉండాలి. శాసనసభకు అంబుడ్స్ మెన్ లా వ్యవహరించకూడదు’’ అని సుప్రీం న్యాయమూర్తులు స్పష్టం చేయటం గమనార్హం.

సభను సమావేశ పర్చటానికి.. ప్రోరోగ్ చేయటానికి.. రద్దు చేయటానికి 174 అధికరణం ద్వారా గవర్నర్ కు ఉండే అధికారాలను ముఖ్యమంత్రికి.. మంత్రిమండలికి సభలో అధిక్యం ఉన్నప్పుడు వారి సలహా మేరకే.. వారి అంగీకారంతోనే అధికారాల్ని ఉపయోగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారంలో గవర్నర్ కు లేదన్న సుప్రీంకోర్టు.. స్పీకర్ కు గవర్నర్ మార్గదర్శకుడు కారని తేల్చింది. స్పీకర్.. డిప్యూటీ స్పీకర్ తొలగింపులో గవర్నర్ కు పాత్ర ఉండదని స్పష్టం చేయటంతో పాటు.. ప్రభుత్వం అధిక్యాన్ని కోల్పోతేనే మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించాలని తేల్చి చెప్పింది.

అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభం కేసులో జస్టిస్ మదన్ బి లోకుర్ తన తీర్పును వెల్లడిస్తూ.. ‘‘స్వతంత్ర భారతదేశంలో  ఇటువంటి పరిస్థితి ఏర్పడటం చాలా దురదృష్టకరం. మన ప్రజాస్వామ్యానికి హానికరం’’ అని వ్యాఖ్యానించటంతో పాటు.. ‘‘అరుణాచల్ ప్రదేశ్ లో గవర్నర్ కు మంత్రిమండలి నుంచి సలహా అందింది. కానీ.. దాన్ని విస్మరించాలని అనుకున్నారు. మంత్రి మండలి డిసెంబరు 14 - 2015న ఒక తీర్మానం చేసి ఆయన ముందు ఉంచినా దాన్ని విస్మరించారు. మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాల్సిన పని లేదనుకున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడై ఉండి ప్రతిష్టంబనను తొలగించే చర్యలు తీసుకోవాలనుకోలేదు’’ అంటూ ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి మాటలు అనిపించుకున్నాక గవర్నర్ గిరిలో కొనసాగాలా? అన్న విషయాన్ని రాజ్ ఖోవాకు.. ఆయన్ను అక్కడ కూర్చోబెట్టిన వారికే వదిలేస్తే మంచిదేమో.
Tags:    

Similar News