‘మోడీ’కి అరుణాచల్ ప్రదేశ్ దెబ్బ పడింది

Update: 2016-07-13 07:26 GMT
మోడీ పరివారానికి భారీ దెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ లో అధికార బదిలీ ఇష్యూలో తెర వెనుక పావులు కదిపిన మోడీ పరివారానికి సుప్రీం భారీ షాకిచ్చింది. ఈశాన్యంలో పవర్  చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో కమలనాథులు వేసిన ప్లాన్ కు మోడీ అంగీకారం లేకుండా కథ నడుస్తుందనుకోలేం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేల్ని పార్టీ నుంచి బయటకు వచ్చేలా చేసి.. విపక్ష బీజేపీ ఎమ్మెల్యేల మద్దత్తుతో పవర్ లోకి వచ్చిన సర్కారు చెల్లదని చెప్పటమే కాదు.. గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్దరించాలంటూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ తీరును తప్పు పట్టింది.

పైకి గవర్నర్ నిర్ణయం తప్పుగా కనిపించినప్పటికి.. వెనుక కథ నడిపిందంతా బీజేపీ అగ్ర నాయకత్వమేనన్నది బహిరంగ రహస్యం. అరుణాచల్ ప్రదేశ్ లో తమ సర్కారును కుట్రపూరితంగా అధికారం నుంచి దించేశారంటూ సుప్రీం గడప తొక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అరుణాచల్ ప్రదేశ్ లో పునరుద్ధరించాలంటూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో.. పదవీచ్యుతుడైన మాజీ ముఖ్యమంత్రి నబామ్ తుకీ మరోసారి సీఎం అయ్యే అవకాశం లభించినట్లైంది. ఎన్నికల్లో తగులుతున్న ఎదురుదెబ్బలతో కిందామీదా పడిపోతున్న కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కొత్త ఉత్సాహాన్నిఇస్తుందనటంలో సందేహం లేదు. అదే సమయంలో.. దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ పరివారానికి మాత్రం సుప్రీం తీర్పు పెద్ద షాక్ అనే చెప్పక తప్పదు. 
Tags:    

Similar News