‘అమ్మ’కు సుప్రీం షాకిచ్చింది

Update: 2016-08-24 09:30 GMT
అభిమానంతో పిలిచే పేరును బ్రాండ్ గా మార్చుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత తమిళనాడు ముఖ్యమంత్రి కమ్ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సొంతం చేసుకున్నారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత తమిళనాడులో ఒక అధికారపార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించిన సంచలనం సృష్టించారు. పవర్ లో ఉన్నా లేకున్నా మోస్ట్ పవర్ ఫుల్ గా ఉండటం.. నచ్చని వారి విషయంలో కఠినంగా వ్యవహరించే అలవాటున్న అమ్మ.. తనను ఎవరైనా తప్పు పడితే ఏ మాత్రం తట్టుకోలేరు.

అందుకే.. తనను విమర్శించే రాజకీయ నేతలు మొదలుకొని మీడియా సంస్థల వరకూ పరువునష్టం దావాలు వేసుకుంటూ పోతారు. దేశంలోనే ప్రముఖ మీడియా సంస్థగా.. ఇప్పటికి విలువలుపాటించే మీడియా హౌస్ లలో ఒకటిగా చెప్పుకునే మీడియా సంస్థ మీద అమ్మ వేసిన పరువునష్టం కేసులు డజన్లు కొద్దీ ఉన్నట్లుగా చెబుతున్నారు.

సదరు మీడియా సంస్థ విషయంలోనే అమ్మ అలా ఉంటే.. మామూలు వారి విషయంలో ఇంకెంత కఠినంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అమ్మ వేసిన ఒక పరువునష్టం దావా కేసును విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులు విమర్శలు ఎదుర్కోవాలే కానీ.. ప్రతి విమర్శకూ కేసులు వేయటం సరికాదంటూ హితవు పలికింది. ప్రజాస్వామ్యం నడిచే విధానం ఇది కాదంటూ అమ్మ వైఖరిని తప్పుపట్టింది.

గడిచిన ఐదేళ్లలో రాజకీయ ప్రత్యర్థులు.. మీడియా సంస్థలపై అమ్మ వేసిన పరువునష్టం కేసులు 213. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఈ కేసుల్ని వేశారు. ఆసక్తికరమైన విషక్ష్ ఏమిటంటే.. ముఖ్యమంత్రి సెలవు మొదలు.. నీటి సమస్యలు.. ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీల్ని నెరవేర్చకున్నా వాటిని ఎత్తి చూపిస్తూ విమర్శలు చేసిన వారిపై పరువునష్టం కేసును సంధించటం గమనార్హం.

మరో కీలక అంశం ఏమిటంటే.. తమిళనాడు ప్రభుత్వం వేసిన పరువునష్టం కేసుల విచారణ సందర్భంగా అమ్మ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టటం ఇది రెండోసారి. తాజాగా వేసిన మొట్టికాయలతో అయినా అమ్మ తనవైఖరిని మార్చుకుంటారా? లేదా? అన్నది కాలమే తేల్చాలి.
Tags:    

Similar News