సుప్రీంకోర్డు ప‌ర్యావ‌ర‌ణాన్ని నాశ‌నం చేస్తుంద‌ట‌

Update: 2017-05-11 03:26 GMT
ఉన్న‌ది ఉన్న‌ట్లుగా సూటిగా చెప్పేస్తుంటారు న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు చెందిన కొంద‌రు. నిష్ఠూరంగా ఉండే నిజాన్ని చెప్పే న్యాయ‌మూర్తుల మాట‌లు మీడియాలో ప్ర‌ధానంగా ఫోక‌స్ అవుతుంటాయి. దీనికి కార‌ణం లేక‌పోలేదు. సాధార‌ణంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు చెందిన ప్ర‌ముఖులు పెద్ద‌గా మాట్లాడ‌రు. ఒక‌వేళ మాట్లాడినా.. వారి మాట‌లు ఆచితూచి ఉంటాయే త‌ప్పించి..  స‌మాచారం ఇవ్వ‌టం కోస‌మ‌న్న‌ట్లుగా కూడా ఉండ‌వు. ఇలాంటి వేళ‌.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఎవ‌రూ ప్ర‌స్తావించ‌ని అంశాల్ని.. త‌మ ప‌రిధిలోని లోపాల్ని ఎత్తి చూపించే న్యాయ‌మూర్తులు చాలా త‌క్కువ‌గా ఉంటారు. ఇలాంటి వేళ‌.. సుప్రీంకోర్టు జ‌డ్జి స్థాయి ప్ర‌ముఖుడు.. సుప్రీంకోర్టుకు అవ‌స‌ర‌మైన ఒక ప్ర‌ధాన అంశాన్ని ప్ర‌స్తావించ‌టం.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

తాజాగా జ‌రిగిన సుప్రీంకోర్టు డిజిటల్‌ ఫైలింగ్‌ విధానాన్ని ప్రారంభిస్తూ ప్ర‌ధాని మోడీ కీలకోపన్యాసం చేశారు.  అనంత‌రం మాట్లాడిన ప‌లువురు వ‌క్త‌ల్లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్ ఒక‌రు. ఆయ‌న మాట్లాడుతూ.. నేటికీ సుప్రీంకోర్టులో వైఫై అందుబాటులో లేద‌ని.. ఒక‌వేళ వైఫై అమ‌రిస్తే భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌కు ముప్పు వాటిల్లుతుంద‌ని గ‌త చీఫ్ జ‌స్టిస్‌కు ఎవ‌రో చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

ఈ మాట‌ను చెబుతూ.. మ‌రి అమెరికా ర‌క్ష‌ణ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం పెంట‌గాన్ లోనే వైఫై అందుబాటులో ఉన్న‌ప్పుడు సుప్రీంకోర్టులో దానిని ఎందుకు అమ‌ర్చ‌కూడ‌ద‌ని సూటిగా.. లాజిక్కా ప్ర‌శ్నించారు జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌.  సుప్రీంకోర్టులో కేసుల న‌మోదుకు డిజిట‌ల్ వ్య‌వ‌స్థ ప్ర‌వేశ పెట్ట‌టం శుభ ప‌రిణామంగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. ప‌ర్యావ‌ర‌ణాన్ని నాశ‌నం చేస్తున్న అతి ముఖ్య వ్య‌వ‌స్థ‌ల్లో సుప్రీంకోర్టు ఒక‌ట‌ని తాను గ‌తంలో వ్యాఖ్యానించేవాడిన‌న్నారు. సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పేప‌ర్ల‌ను వృథా చేస్తామ‌ని.. ఒక్కో కేసులో ట‌న్నుల కొద్దీ పేప‌ర్ల‌ను దాఖ‌లు చేస్తార‌ని.. ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిని ఎందుకు ఉప‌యోగించ‌ర‌ని తాను అడిగేవాడిన‌న్నారు.

ప్ర‌ధాని మోడీ చెప్పిన‌ట్లుగా స‌మ‌స్య అంతా ఆలోచ‌న‌ల్లోనే ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న ఒక ఉదాహ‌ర‌ణ‌ను ప్ర‌స్తావించారు. 1997లో న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో కంప్యూట‌రీక‌ర‌ణ ప్రారంభ‌మైంద‌ని.. దాన్ని ప‌ర్య‌వేక్షించే క‌మిటీ బాధ్య‌త‌ల్ని సీనియ‌ర్ జ‌డ్జి పి. వెంక‌ట్రామిరెడ్డితో పాటు త‌న‌కూ అప్ప‌గించార‌న్నారు. కంప్యూట‌రీక‌ర‌ణ వ‌ల్ల జ‌రిగే లాభాల మీద స‌మావేశాన్ని ఏర్పాటు చేస్తే 35 మంది జ‌డ్జిలు హాజ‌ర‌య్యార‌ని.. మ‌ధ్య‌లోనే ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో స‌హా అంద‌రూ వెళ్లిపోయిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

మూడేళ్ల క్రితం జ‌రిగిన మ‌రో ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ.. ఒక కేసుకు సంబంధించి ఒక లాయ‌ర్ త‌న‌కు ప‌దివేల కాగితాలు స‌మ‌ర్పించార‌ని.. తాను ఆ ఫైల్‌ను ఎల‌క్ట్రానిక్ ఫార్మాట్ లో ఇవ్వాల‌ని కోరాన‌ని.. ఆయ‌నో పెన్ డ్రైవ్ లో పెట్టి ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టును కంప్యూట‌రీక‌ర‌ణ చేయాల‌ని అనుకున్న 20 ఏళ్ల త‌ర్వాత ఒక గొప్ప ముంద‌డుగు ప‌డ‌టం హ్యాపీగా ఉంద‌ని జ‌స్టిస్ జాస్తి వ్యాఖ్యానించారు. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో డిజ‌ట‌లీక‌ర‌ణ‌పై సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.
Tags:    

Similar News