సుప్రీంకోర్టు తీర్పు.. ఇప్పటికైనా కాపులకు జగన్‌ రిజర్వేషన్‌ ఇస్తారా?

Update: 2022-11-08 10:30 GMT
కాపు రిజర్వేషన్‌.. ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న డిమాండ్‌. ఇప్పటివరకు ఈ అంశంపై ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు సాగాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమమే నడిచింది. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టేవారికి ఈ ఆందోళన రేగింది.

కాగా తాజాగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నిర్ణయాన్ని 3:2 తో సమర్థించింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రవర్ణంగా ఉంటూ పేదరికంలో ఉన్న కాపులకు పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం రిజర్వేషన్‌ను వర్తింపజేస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నారు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వం కేంద్రం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన పది శాతం రిజర్వేషనల్లో 5 శాతం పూర్తికా కాపులకు కేటాయించింది. ఈ మేరకు చట్టాలను సైతం చేసింది.

ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్‌ను ఎత్తేశారు. అంతేకాకుండా కాపుల రిజర్వేషన్‌ తన చేతుల్లో లేదని.. అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని తేల్చిచెప్పారు. అయితే కాపుల అభ్యున్నతికి కావాల్సిన చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో హైకోర్టులో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడంపై కోర్టులో కేసులున్నాయంటూ కాపులకు రిజర్వేషన్‌ను జగన్‌ ఎత్తేశారు.

కేంద్రం అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపులకు, మిగిలిన 5 శాతాన్ని మిగిలిన అగ్ర వర్ణ పేదలకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. దీన్ని సవాల్‌ చేస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే హైకోర్టు మాత్రం వీటిపై స్టే ఇవ్వడం ఏమీ చేయలేదు. అయినప్పటికీ వైఎస్‌ జగన్‌ మాత్రం అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కేవలం కాపులకు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటూ దాన్ని ఎత్తేశారు.

వాస్తవానికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ విద్యా, ఉద్యోగ నియామకాల్లో అమలు చేయాల్సి ఉన్నా జగన్‌ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను వర్తింప జేయలేదు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సచివాలయాల ఉద్యోగాలు, తదితరాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ లేకుండానే వాటిని పూర్తి చేసింది. కేవలం విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే వర్తింప జేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎట్టకేలకు 2021 జులై 14న జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఇప్పుడు ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని అమలుచేయాలని కాపులు కోరుతున్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టులు ఎక్కడా తప్పుపట్టలేదని, స్టే ఇవ్వలేదని కూడా గుర్తు చేస్తున్నారు. మరి వైఎస్‌ జగన్‌ ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News