పార్టీలకు సుప్రీం డెడ్ లైన్: అభ్యర్థుల నేర చరిత్రను 48 గంటల్లో వెల్లడించాలి

Update: 2021-08-10 15:30 GMT
రాజకీయ పార్టీలకు, నేతలకు ఓ రకంగా సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులంతా ఇక తమ నేరచరిత్రను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వారంతా గతంలో వారు చేసిన నేరాల పుట్టను విప్పాలంటూ సుప్రీంకోర్టు పేర్కొంది.

రాజకీయ వ్యవస్థను నేరరహితంగా మార్చే దిశగా అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును తాజాగా వెలువరించింది. రాజకీయ పార్టీలు ఎన్నికల నిమిత్తం తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి నేరచరిత్రను బహిర్గతం చేయాలని మంగళవారం కీలక తీర్పును వెలువరించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించేందుకు హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసులను ఉపసంహరించడం వీలు కాదని తెలియజేసింది.బీహార్ ఎన్నికలకు సంబంధించిన కేసులో ఇప్పటికే ఈ తీర్పునిచ్చింది. దానిలో భాగంగా ఎంపికైన అభ్యర్థులు 48 గంటల్లో తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని లేకపోతే నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించిన తేదీకి కనీసం రెండు వారాల ముందు ఈ వివరాలను బయలు పర్చాలని ఆదేశించింది.

తాజాగా తీర్పులో రెండువారాలను 48 గంటలకు పరిమితం చేసింది. పార్టీలు నేరచరిత్ర ఉన్న అభ్యర్థులను ఎందుకు ఎంచుకుంటున్నాయో కారణాల్ని వివరించాలని.. కేసుల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచాలని కోర్టు వెల్లడించింది.

ఇక తమ అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయని రాజకీయ పార్టీల గుర్తులను నిలిపివేయాలంటూ సుప్రీంలో పిటీషన్లు దాఖలయ్యాయి. అలాగే గతంలో ఇచ్చిన ఆదేశాలను పార్టీలు పాటించనందున అవి కోర్టును ధిక్కరించినట్లు భావించాలని పిటిషనర్లు కోరారు.

మరో పక్క కోర్టు ఆదేశాలను పాటించనందుకు సీపీఐ(ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భేషరుతుగా కోర్టుకు క్షమాపణలు తెలియజేశాయి.




Tags:    

Similar News