మారిటోరియంపై వడ్డీ మీద వడ్డీ...సుప్రీం కీలక వ్యాఖ్యలు

Update: 2020-09-10 17:36 GMT
కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక రంగం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎందరో ఉద్యోగాలు కోల్పోయి...మరెందరో వ్యాపారలు దివాలా తీసి....తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి 6 నెలలపాటు మారిటోరియం విధించేలా వెసులుబాటు కల్పించింది ఆర్‌బీఐ. అయితే మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించడంతో ప్రజల నడ్డి విరిగినంత పనైంది. కరోనా కాలంలో కరువు తాండిస్తున్న సమయంలో అసలు కట్టేందుకే దిక్కుతోచకుంటే....బ్యాంకులు వడ్డీపై వడ్డీ వసూలు సరైంది కాదని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. మారిటోరియంపై బ్యాంకుల `వడ్డీం`పుపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండా రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐలను సుప్రీం ఆదేశించింది.

మారిటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయకుండా నిలువరించాలని దాఖలైన పిటిషన్ల‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మారిటోరియం నేపథ్యంలో వారి నుంచి వడ్డీ మీద వడ్డీ వసూలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. కరోనా వేళ రుణ గ్రహీతలపై భారం పడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం , ఆర్బీఐ, బ్యాంకులకు సుప్రీం సూచించింది. మారిటోరియం నేపథ్యంలో రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండా 2 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసును మరోసారి వాయిదా వేసేందుకు సుప్రీం నిరాకరించింది. ఇదే చివరి అవకాశమని రెండు వారాల్లోగా రుణగ్రహీతలకు భారం పడనివిధంగా పరిష్కారంతో అఫిడవిట్‌ సమర్పించాలని కోరింది. సెప్టెంబర్‌ చివరివారంలో కేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యేవరకూ ఆయా ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది.అయితే, రుణగ్రహీతలకు ఊరట కల్గించే విధంగా బ్యాంకులతో ఉన్నతస్ధాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని దేశపు అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం వివరణ ఇచ్చింది.
Tags:    

Similar News