ఎలక్టోరల్‌ బాండ్ల జారీ పై సుప్రీం కీలక నిర్ణయం !

Update: 2021-03-26 09:30 GMT
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ  నేపథ్యంలో ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయంపై స్టేను విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై తాజాగా సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయంపై స్టే విధించలేమంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. 2018, 2019 సంవత్సరాలలో బాండ్లను ఎలాంటి అంతరాయం లేకుండా విడుదల చేశారు. అంతేకాకుండా వీటిని జారీ చేయడంలో తగినంత భద్రత చర్యలు ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయంపై స్టేను విధించమనడంలో న్యాయబద్ధతలేదు అని కోర్టు తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 1నుంచి ఎలక్టోరల్‌ బాండ్లను జారీ చేసుకోవచ్చని తెలిపింది.

ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఎలక్ట్రోరల్‌ బాండ్లు జారీ చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌పై సీజేఐ బాబ్డేతో పాటు జస్టిస్‌ బోపన్న, వి. రామసుబ్రమణియమ్‌ తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఎలక్ట్రోరల్‌ బాండ్లు జారీ చేయడం అనేది తరచుగా జరిగే ప్రక్రియేనని ధర్మాసనం అభిప్రాయపడింది. మూడేళ్లుగా ఎలక్ట్రోరల్‌ బాండ్లు జారీ అవుతూనే ఉన్నాయని గుర్తు చేసింది. కాబట్టి దీన్ని ఇప్పుడు అడ్డుకోవాలని కోరడం సమజసం కాదని తెలిపింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ ను కొట్టేసింది.

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల జారీ ద్వారా నిధుల సేకరణకు వీలుంది. ఇలా జారీ చేస్తున్న ఎలక్ట్రోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు తీవ్రవాదులు, ఇతర సంఘ వ్యతిరేక శక్తుల ద్వారా నిధులు అందుతున్నాయని, వీటిపై కేంద్రం నియంత్రణ లేదంటూ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం.. ఎలక్ట్రోరల్‌ బాండ్లకు అందుతున్న నిధులపై నియంత్రణ ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
Tags:    

Similar News