వాహ్‌.. ఆ బాస్ ఔదార్యం అద‌ర‌హో

Update: 2018-09-29 17:30 GMT
సావ్జీ ఢోల‌కియా.. సూర‌త్‌కు చెందిన ఈ వ‌జ్రాల వ్యాపారి పేరు కొన్నేళ్లుగా త‌ర‌చూ వార్త‌ల్లో వినిపిస్తోంది. ఉద్యోగుల‌ను క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకునే ఢోల‌కియా.. ఏటా వారికి ఖ‌రీదైన బ‌హుమ‌తులు, భారీ మొత్తంలో బోన‌స్‌ లు ఇస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేస్తున్నాడు. ఉద్యోగుల‌పై త‌న ఔద‌ర్యాన్ని తాజాగా ఆయ‌న మ‌రోసారి ఘ‌నంగా చాటుకున్నారు. త‌న‌ సంస్థ‌లో ముగ్గురు ఉత్త‌మ ఉద్యోగుల‌ను గుర్తించి.. ఒక్కొక్క‌రికి రూ.కోటి విలువైన మెర్సిడెజ్ కార్ల‌ను బ‌హుమ‌తిగా అందించారు.

1977లో కేవ‌లం రూ.12.5 చేతిలో ప‌ట్టుకొని సూర‌త్‌ కు వ‌చ్చిన ఢోల‌కియా.. త‌న కృషి - ప‌ట్టుద‌ల‌తో అంచెలంచెలుగా ఎదిగారు. వ‌జ్రాల వ్యాపారంలో హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌ పోర్ట్ కంపెనీని స్థాపించారు. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు. ప్ర‌స్తుతం ఆ సంస్థ‌లో 5,500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.6,000 కోట్లు.

త‌న ఎదుగుద‌ల‌లో ఉద్యోగుల కృషి ఎంత‌గానో ఉంద‌ని త‌ర‌చూ చెప్పే ఢోల‌కియా.. వారి సంక్షేమానికి పెద్ద‌పీట వేయ‌డం త‌న బాధ్య‌త‌గా చెబుతుంటారు. అందులో భాగంగానే ఏటా ఉద్యోగుల‌కు బోన‌స్‌ ల రూపంలో అధిక మొత్తాల‌ను అంద‌జేస్తుంటారు. ఇళ్లు - కార్లు - వజ్రాలు - ఆభరణాలు వంటి విలువైన బ‌హుమ‌తులు అంద‌జేస్తూ వారిని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేస్తుంటారు. 2016లో ఉద్యోగుల‌కు కానుక‌లు ఇవ్వ‌డానికే ఆయ‌న ఏకంగా రూ.51 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం గ‌మ‌నార్హం.

అదే బాట‌లో తాజాగా త‌న కంపెనీలో ప‌నిచేస్తున్న ముగ్గురు ఉత్త‌మ ఉద్యోగుల‌ను గుర్తించిన ఢోల‌కియా.. వారికి ఏకంగా రూ.కోటి విలువైన బెంజ్ కార్ల‌ను అందించి ఆశ్చ‌ర్య‌ప‌ర్చారు. ఆ ముగ్గురు ఉద్యోగులు 13-15 ఏళ్ల మ‌ధ్య ఢోల‌కియా సంస్థ‌లో చేరార‌ట‌. అక్క‌డే 25 ఏళ్లు పూర్తి చేసుకున్నార‌ట‌. పాతికేళ్లుగా వారు త‌న వ‌ద్ద‌ అత్యంత న‌మ్మ‌కంగా ప‌నిచేస్తున్నార‌ని.. అందుకే వారి రుణం తీర్చుకునే చిన్న ప్ర‌య‌త్నమే త‌న బ‌హుమ‌తుల‌ని ఢోల‌కియా చెప్పుకొచ్చారు. ఇలాంటి బాస్ మ‌న‌కూ ఉంటే బాగుంటుంద‌నిపిస్తోంది క‌దూ..!
Tags:    

Similar News