రీల్ హీరో.. రాజ్యసభలో ‘హీరో’ అయ్యాడే

Update: 2016-08-11 18:01 GMT
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా వెండి తెర మీద కనిపిస్తూ.. ఆవేశంతో చెప్పేడైలాగులతో ఉత్తేజం పొందేలా యాక్ట్ చేస్తూ చెలరేగిపోయే సురేశ్ గోపీ గుర్తున్నాడా? తెలుగు.. తమిళం.. మలయాళం సినీ ప్రియులకు సుపరిచితుడైన సురేశ్ గోపీ ఇటీవల రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే. కేరళ బీజేపీ నేతగా వ్యవహరిస్తూ ఈ మధ్య జరిగిన కేరళ ఎన్నికల్లో తన ముద్రను ప్రదర్శించాలని తపించిన ఆయనకు ఓటర్లు దెబ్బేయటంతో ఆయన కాసింత నిరాశకు గురయ్యారు. తన ఇమేజ్ పార్టీ గెలుపునకు తోడవుతుందన్న ఆశలు వమ్ము అయినా.. కమలనాథులు మాత్రం సురేశ్ గోపీని రాజ్యసభకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎంపీగా అడుగు పెట్టిన సురేశ్ గోపీ తన తొలి పార్లమెంటు సమావేశాల్లో తన ముద్రను స్పష్టంగా ప్రదర్శించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి స్టాండింగ్ కమిటీకి ఇవ్వాల్సిన నివేదికను తాజాగా ఇచ్చారు.ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ సురేశ్ గోపీని అభినందించారు. ఇప్పటివరకూ మిమ్మల్ని సినిమాల్లో చూశామని.. ఇప్పుడు రియల్ గా చూస్తున్నామంటూనే.. తొలి సమావేశాల్లోనే నివేదిక ఇచ్చిన తీరును అభినందించారు.

వెండితెర మీద తన నటనతో ప్రేక్షకుల మదిని దోచుకున్న సురేశ్ గోపీ.. ఈసారి రియల్ లైఫ్ లో పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ తన మార్క్ ను ప్రదర్శించటం కమలనాథుల్లోనే ఆనందం వెల్లి విరిసింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని పెద్దల సభకు నియమిస్తూ.. వారి అనుభవాన్ని దేశానికి అందిస్తారన్న ఉద్దేశంతో రాజ్యసభకు సభ్యుల్ని ఎంపిక చేసే పరిస్థితి. ఇప్పుడలాంటి ఆదర్శాలు ఏమీ లేకున్నా.. ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన రాజకీయ వ్యూహంతో సెలబ్రిటీల్ని రాజ్యసభకు పంపుతున్న పరిస్థితి. అందరి మాదిరి రాజ్యసభకు రావటం అంటే అదేదో హడావుడిగా కాకుండా.. సభకు ఎంపిక చేసిన దానికి తగ్గట్లు ఎంతోకొంత చేయాలన్నట్లుగా వ్యవహరించిన సురేశ్ గోపీని మిగిలిన సెలబ్రిటీలు అనుసరిస్తు బాగుంటుంది. అంతటి కమిట్ మెంట్ సెలబ్రిటీల నుంచి ఆశించగలమా?
Tags:    

Similar News