ట్రైన్ డ్రైవర్ క్యాబిన్ లో సురేశ్ ప్రభు జర్నీ

Update: 2016-04-17 09:43 GMT
మోడీ క్యాబినెట్ లో అంతమంది మంత్రులు ఉన్నా.. వారెవరికి రాని విలక్షణమైన గుర్తింపు రైల్వే మంత్రి సరేశ్ ప్రభు సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ ఖాతాతో రైల్వేల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల అవసరాల్ని తీర్చటమే కాదు.. నిమిషాల వ్యవధిలో ఆయన అందిస్తున్న సేవలపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ట్రైన్లో ప్రయాణిస్తున్న వారెవరికైనా కష్టం వచ్చి.. రైల్వే మంత్రి ట్విట్టర్ ఖాతాలో కానీ సాయం కోసం పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలో వారికి అవసరాల్ని తీరుస్తున్న ఆయన.. భారత రైల్వేల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ మధ్యనే ఆయన ఫ్రాన్స్ లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆ దేశంలోని హైస్పీడ్ ట్రైన్ ఎలా పని చేస్తుంది..? దాని వేగం.. రక్షణ లాంటి అంశాల్ని స్వయంగా పరిశీలించారు. ఇందుకోసం ఆయన 150 కిలోమీటర్ల దూరాన్ని ట్రైన్ లో ప్రయాణించటం ఒక ఎత్తు అయితే.. తన జర్నీని సదరు ట్రైన్ డ్రైవర్ క్యాబిన్ లో కూర్చొని రైలు భద్రతా వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించటం గమనార్హం.

గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్  ప్యారిస్ నుంచి రీమ్స్ నగరం మధ్యలో నడుస్తుంది.  ఈ రెండు నగరాల మధ్య దూరం 150 కిలో మీటర్లు. తన ప్రయాణాన్ని ఈ హైస్పీడ్ ట్రైన్ లో 45 నిమిషాల్లో పూర్తి చేశారు. భారత్ లో ఇదే తరహా వేగవంతమైన రైళ్లను ప్రవేశ పెట్టాలన్న ఆలోచనలోమోడీ సర్కారు ఉన్న విషయం తెలిసిందే. సురేశ్ ప్రభు తీరు చూస్తే.. భారత రైల్వేల రూపురేఖలు మార్చాలన్న సంకల్పం బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News