కెరీర్ పై సురేశ్ రైనా షాకింగ్ నిర్ణయం

Update: 2022-09-06 11:40 GMT
టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా ఆటకు గుడ్ బై చెప్పేశాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాటకు రైనా రిటైర్మెంట్ ప్రకటిస్తూ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించాడు. తాను క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నానని రైనా స్వయంగా తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.

ఉత్తర ప్రదేశ్, భారత్ జట్లకు ప్రాతినిధ్యం వహించడం గర్వించదగ్గ విషయమని రైనా అన్నాడు. బీసీసీఐ, యూపీ క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్ తోపాటు రాజీవ్ శుక్లాలకు రైనా ధన్యవాదాలు తెలిపాడు.

రైనా గురించి క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర లేదు. భారత్ తరఫున ఆడిన సక్సెస్ ఫుల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా కెరీర్ మొదలుబెట్టిన రైనా..ఆ తర్వాత మేటి ఆల్ రౌండర్ గా ఎదిగాడు. మిడిలార్డర్ లో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ గా, పార్ట్ టైమ్ స్పిన్నర్ గా, చురుకైన ఫీల్డర్ గా రైనా భారత క్రికెట్ జట్టుకు విశేష సేవలందించాడు. ధోనీకి నమ్మిన బంటుగా ఉన్న రైనా...ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే అంతర్జాతీయ క్రికెట్ నుంచి  రైనా కూడా తప్పుకున్నాడు.

అయితే, మొన్నమొన్నటి వరకు ఐపీఎల్ తో పాటు రంజీ క్రికెట్ కు అందుబాటులో ఉన్నాడు. కానీ, గత సీజన్ లో రైనాను తన హోమ్ ఫ్రాంచైజీగా భావించే చెన్నై ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. ఇక, మిగతా ఫ్రాంచైజీలు కూడా రైనాపై ఆసక్తి చూపలేదు.

ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాలని రైనా నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. 2021 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వ్యక్తిగత కారణాలతో అర్ధాంతరంగా రైనా లీగ్ నుంచి వైదొలగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ విషయంలో రైనాపై చెన్నై ఫ్రాంచైజీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత రైనా ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

ఐపీఎల్‌ కెరీర్‌లో రైనా  205 మ్యాచ్‌ లు ఆడి 5528 పరుగులు చేశాడు. భారత్ తరపున 226 వన్డేలు ఆడిన రైనా 5615 చేశాడు. 78 టీ20 లు, 18 టెస్టుల్లో టీమిండియాకు రైనా ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ కెరీర్ లో భారత్ తరఫున రైనా 8 వేల పరుగులు చేశాడు. ఇక, 3 ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన తొలి భారత క్రికెటర్ గా రైనా రికార్డు సృష్టించాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News