టీఆర్ ఎస్‌లో స‌ర్వే పాలిటిక్స్‌.. అప్ప‌డ‌ప్పుడు లీకులు ఇస్తున్న కేసీఆర్‌..

Update: 2022-08-30 09:45 GMT
అధికార పార్టీ నేతలకు ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) ఫీవర్‌ పట్టుకుంది. కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై భూ కబ్జాలు, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలకు తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అత్యంత కష్టమని అధినేత కేసీఆర్‌కు కొన్నాళ్ల కింద‌ట నివేదిక అందడమే ఇందుకు కారణం.

అయితే.. ఈ స‌ర్వే నివేదిక‌లో ఏముందో ఒకే సారి చెప్ప‌కుండా.. కేసీఆర్‌.. అప్పుడప్పుడు .. కొంద‌రు నాయ‌కులు.. జిల్లాల‌కు సంబంధించి లీకులు ఇస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో నాయ‌కులు హ‌డలి పోతున్నారు.

కేసీఆర్ చేతిలో ఉన్న స‌ర్వే ఫ‌లితాల‌కు తోడు... ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్లు అవకాశం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సొంత పార్టీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గం, బంధువులు, పార్టీ శ్రేణులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. వెంటనే వాలిపోతున్నారు.  

హైద‌రాబాద్‌కు స‌మీపంలోని రంగారెడ్డి జిల్లా.. చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నంల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, అవినీతిపై వీరిరువురూ బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు.

మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఎల్బీనగర్‌లోనూ ఇదే తంతు కనిపిస్తోంది. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రామ్మోహన్‌గౌడ్‌ మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌లో సిట్టింగ్‌ స్థానంపై మంత్రి కుమారుడితో పాటు ఎంపీ కన్నేశారు.

ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎవరికి వారు పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరు స్థానికంగా ఉన్న సామాజికవర్గం బంధువులు, ముఖ్య నేతలను తరచూ కలుస్తుండటంతో కేడర్‌లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరువురూ విఫలమవుతున్నారు. మొత్తానికి తమపై ఎలాంటి రిపోర్ట్‌ అందిందోనని ఎమ్మెల్యేలు టెన్షన్‌ పడుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News