సూర్యాపేట కాంగ్రెస్ సీటు ఎవ‌రికో తేలింది..!

Update: 2022-02-16 13:30 GMT
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఎవ‌రికో తేలింది. అధిష్ఠానం ఇప్పుడే ప్ర‌క‌టించ‌క‌పోయినా అంత‌ర్గ‌తంగా అభ్య‌ర్థిని ఫిక్స్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

పార్టీ పెద్ద‌లు నోరు విప్ప‌క‌పోయినా స‌భ్య‌త్వ న‌మోదుతో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైందని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. పార్టీ లైన్ కు అనుగుణంగా ప‌ని చేస్తున్న ఆ సీనియ‌ర్ నేత‌కే టికెట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అనుచ‌రులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. స‌భ్య‌త్వ న‌మోదును మ్యాన్యువ‌ల్ గా కాకుండా డిజిట‌ల్ పద్ధ‌తిలో నిర్వ‌హించారు.

సోనియాగాంధీ పుట్టినరోజును పుర‌స్క‌రించుకొని డిసెంబ‌రు 9న ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 30 ల‌క్ష‌ల స‌భ్య‌త్వ న‌మోదును ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవ‌లే ఆ ల‌క్ష్యం పూర్త‌యింది. ప్ర‌స్తుతం 32 ల‌క్ష‌ల చేరువ‌లో స‌భ్య‌త్వాలు ఉన్నాయి.

అయితే.. ఏఐసీసీ నిర్దేశించిన స‌భ్య‌త్వాల న‌మోదులో తెలంగాణ‌లోనే న‌ల్ల‌గొండ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం మొద‌టి స్థానంలో నిలిచింది.

పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఉత్త‌మ్‌, జానారెడ్డి, దామోద‌ర్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని స‌భ్య‌త్వాలు చేయించారు. పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో సూర్యాపేటలో అత్య‌ధిక స‌భ్య‌త్వాలు న‌మోదు అయ్యాయి. దీంతో పార్టీ అధిష్ఠానం న‌ల్ల‌గొండ నేత‌ల‌ను ప్ర‌శంసించింది.

పార్టీ సీనియ‌ర్ నేత దామోద‌ర్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సూర్యాపేటలో 88,500 స‌భ్య‌త్వాలు.., ఎంపీ ఉత్త‌మ్ స్థానం హుజూర్ న‌గ‌ర్ లో 85,000.. కోదాడ‌లో 85,000.. పార్టీ దిగ్గ‌జం జానా రెడ్డి స్థాన‌మైన నాగార్జున సాగ‌ర్ లో 65,000.., దేవ‌ర‌కొండ‌లో 48,000.. మిర్యాల‌గూడ లో 48,000 స‌భ్య‌త్వాలు పూర్త‌య్యాయి.

పార్టీ సీనియ‌ర్ నేత, ఎంపీ కోమ‌టి రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న న‌ల్ల‌గొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం 13 వేల స‌భ్య‌త్వాలే న‌మోదు అయ్యాయి.

అయితే.. అస‌లు చిక్కంతా ఇక్క‌డే వ‌చ్చింద‌ని పార్టీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. పార్టీ స‌భ్య‌త్వాల న‌మోదు ఆధారంగానే అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తామ‌ని అధిష్ఠానం స్ప‌ష్టం చేసింది. ప‌నిచేసే నేత‌ల‌కే పట్టం క‌డ‌తామ‌ని సూచించింది.

ఈ ప్ర‌కారం చూస్తే  సూర్యాపేట టికెట్ జిల్లాలోనే అత్య‌ధిక స‌భ్య‌త్వాలు చేయించిన పార్టీ ఉపాధ్య‌క్షుడు రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డికే వ‌స్తుంది. తుంగ‌తుర్తి నుంచి ఐదుసార్లు, సూర్యాపేట నుంచి ఒక‌సారి గెలిచి ప‌లు ప‌ర్యాయాలు మంత్రిగా ప‌నిచేసిన ఈయ‌న‌నే అధిష్ఠానం గుర్తిస్తుంద‌ని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

అయితే.. రేవంత్ ప్ర‌ధాన అనుచ‌రుడైన ప‌టేల్ ర‌మేష్ రెడ్డి కూడా ఈ సీటుపై ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌తంలో రెండు సార్లు ఇక్క‌టి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈయ‌న‌కే సానుభూతి ఎక్కువ‌గా ఉంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ హామీ కూడా ల‌భించింద‌ని ఆయ‌న అనుచ‌రులు గుర్తుచేస్తున్నారు. చూడాలి మ‌రి అధిష్ఠానం నిర్ణ‌యం ఎలా ఉంటుందో..!
Tags:    

Similar News