సమస్యా..? చిన్నమ్మ ఉందిగా

Update: 2016-10-13 05:26 GMT
కాసింత హైప్ చేసినట్లుగా అనిపిస్తుంది కానీ.. వాస్తవిక కోణంలో చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. చిన్నమ్మగా అందరికి సుపరిచితురాలైన బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ స్పందిస్తున్న తీరు ఆమె ఇమేజ్ ను రోజురోజుకీ పెంచుతుంది. తాను నిర్వర్తిస్తున్న విదేశాంగ శాఖకు సంబంధించి ఇష్యూ ఏదైనా సరే.. ఆమె దృష్టికి వెళ్లిన మరుక్షణం.. ఆమె రియాక్ట్ కావటమే కాదు.. సమస్యను పరిష్కరించేందుకు ఆమె ప్రదర్శిస్తున్న చొరవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మోడీ మంత్రివర్గంలోని కొందరు మంత్రులు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండటమే కాదు.. ఆ మాధ్యమం సాయంతో ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకోవటం.. వాటిని పరిష్కరించటం తెలిసిందే. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కూడా ఇదే కోవకు వస్తారు. రైల్వే మంత్రిగా.. రైల్వేలకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా సరే.. ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టిన మరుక్షణం.. దానిపై స్పందన మొదలవుతుంది. ఇప్పటికి ఎన్నోసార్లు ఈ విషయం నిరూపితమైంది కూడా.

ఇక.. చిన్నమ్మ విషయానికి వస్తే.. వీసాకు సంబంధించిన సమస్యల్ని ట్విట్టర్ ఖాతాలో ఆమె దృష్టికి తీసుకొస్తే.. విదేశీ వ్యవహారాల శాఖను రంగంలోకి దించి.. వారి సమస్యను పరిష్కరిస్తున్నారు. మేడమ్.. సమస్యలో ఉన్నానని పోస్ట్ చేస్తే చాలు.. వేగంగా స్పందిస్తున్న సుష్మ దృష్టికి తాజాగా ఒక ఇష్యూ వచ్చింది. మూడు రోజుల క్రితం సరితా ఠాకార్ అనే మహిళ భర్త చనిపోయారు. ఆయనకు అంత్యక్రియలు చేయాల్సిన కుమారుడు అమెరికాలో ఉండిపోయాడు. దీంతో.. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కుటుంబానికి సుష్మ స్వరాజ్ గుర్తుకు వచ్చారు. చిన్నమ్మ ట్విట్టర్ ఖాతాలో తమ సమస్యను ప్రస్తావిస్తూ.. తన భర్త అంత్యక్రియలకు తన కొడుకు వచ్చేలా వీసా ఇప్పించాలని కోరారు.

దీనిపై వెంటనే స్పందించిన సుష్మా.. ఆ తల్లి కోరుకున్నట్లే.. ఆమె కుడుక్కి వీసాను ఇప్పించి అంత్యక్రియలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. అమెరికాలోని అభయ్ కౌల్ డేటాను సేకరించి.. వీసా ఇప్పించి.. ఇండియాకు వచ్చేలా చేశారు. సమస్య ఉంటే చాలు.. సుష్మా ఉందిగా అనిపించేలా వ్యవహరిస్తున్న చిన్నమ్మ తీరు ఆన్ లైన్ లో ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుష్మ.. సురేశ్ ప్రభు బాటలో మిగిలిన మంత్రులు నడిస్తే ఎంత బాగుండు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News