చైనా క‌వ్వించినా..యుద్ధం వ‌ద్దంటున్న భార‌త్‌

Update: 2017-08-04 06:27 GMT
భార‌త్‌-చైనాల మధ్య డోక్లాం వివాదం తీవ్రతరం కావడం, రోజువారీగా చైనా నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశీయంగానే కాకుండా అంత‌ర్జాతీయంగా సైతం ఇలాంటి అంచ‌నాలు వెలువడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు కేంద్ర మంత్రులు భిన్న‌మైన అభిప్రాయాలు వినిపించారు. ఒక‌రు దేశం త‌ర‌ఫున మ‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయ‌గా  మ‌రో కేంద్ర మంత్రి త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు.

రాజ్యసభలో మాట్లాడిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ భార‌త్ వైఖ‌రిని తెలిపారు. భారత్‌ కు అత్యంత శక్తివంతమైన సైనిక దళాలున్నాయని, అయితే చైనాతో తలెత్తిన సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. డోక్లాం సరిహద్దు సమస్యను పరిష్కరించి సాధారణ పరిస్థితులును పునరుద్ధరించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు విస్తృతంగా సాగుతున్నాయన్నారు. భారత సైనిక దళాల శక్తియుక్తులను శంకించాల్సిన అవసరం లేదని, యుద్ధంతో సమస్య పరిష్కారం కాదని తెగేసి చెప్పారు. అన్ని రకాల సమస్యలను దౌత్యపరంగా పరిష్కరించుకోడానికి విజ్ఞత ఎంతో అవసరమని ఉద్ఘాటించారు.

ఇటీవల చైనా రాయబారిని లోక్‌ సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలుసుకోవడాన్ని సుష్మా స్వ‌రాజ్‌ తీవ్రంగా ఖండించారు. డోక్లాం వివాదం ఉద్రిక్తతలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో చైనా రాయబారి లూవో జావోహుయిని రాహుల్ కలుసుకోవడంలో ఔచిత్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చైనా - భూటాన్ రాయబారులను జూలై నెలలో కలుసుకున్న విషయాన్ని  మొదట్లో నిరాకరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనంత‌రం అంగీకరించిన విషయం తెలిసిందే.

 గత కొంత కాలంగా చైనా భారత్‌ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, భారత్ భూ భాగంలోకి చొచ్చుకుని వచ్చి అశాంతికి కారణమవుతోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామ్‌ దాస్ అత్‌ వాలే పేర్కొన్నారు. చైనాతో పోరాడేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్‌ పై పాకిస్థాన్ కత్తికట్టి, ఉగ్రవాదులను ఉసిగొలుపుతోందని అన్నారు. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణ నెలకొల్పేందుకు పాకిస్థాన్‌ తో చర్చలకు మనం సిద్ధంగా ఉన్నా, ఆ దేశం ముందుకు రావడం లేదని అత్‌ వాలే అన్నారు. మన దేశంలో తమ వస్తువులు అమ్ముకుంటూ మన దేశానికి చెందిన భూ భాగాన్ని ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. ఇటువంటి చర్యలను భారత్ సహించబోదని అత్‌ వాలే స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం పలు చోట్ల పోరాటాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ సుముఖంగానే ఉందని చెప్పారు. విదర్భను రెండు రాష్ట్రాలుగా చేయాలని చేస్తున్న పోరాటానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) మద్దతు ఇస్తోందని చెప్పారు. అయితే, శివసేన మాత్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేస్తోందని అన్నారు. గూర్ఘాలాండ్ డిమాండ్‌ కు తమ మద్దతు లేదని అత్‌ వాలే ప్రకటించారు. దేశంలో దళితులకు మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి అత్‌ వాలే చెప్పారు. గోరక్షణ పేరుతో దళితులపై జరుగుతున్న దాడులను మోదీ తీవ్రంగా ఖండించారని, భవిష్యత్‌ లో దాడులు జరగకూడదని మోదీ హెచ్చరించారని అత్‌ వాలే తెలియచేశారు.
Tags:    

Similar News