చిన్నమ్మను ఏది పడితే అది అడిగితే..

Update: 2017-01-09 09:39 GMT
ఇప్పుడంటే చిన్నమ్మ అన్నవెంటనే అన్నాడీఎంకే అధినేత్రి శశికళా నటరాజన్ గుర్తుకు వస్తున్నారు. నిజానికి ఆ పిలుపు బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సొంతం. తనను తాను చిన్నమ్మగా చెప్పుకునే ఆమె.. మోడీ సర్కారులో కీలకమైన మంత్రి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తన పనితీరుతో దేశ వ్యాప్తంగా ఆమె ఎందరినో అభిమానులుగా మార్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తనను సాయం కోరిన వారికి సాయం చేస్తూ.. మరింత పాపులారిటీ సంపాదించారు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పటికీ.. తన ట్విట్టర్ ఖాతాలో సాయాన్ని కోరే వారి సమస్యల సొల్యూషన్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. ఇదిలా ఉంటే.. సాయం చేస్తున్నారు కదా అని.. అడ్డదిడ్డమైన సాయాల్ని అడగటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా అలాంటి ఒక ట్వీట్ పై ఘాటుగా స్పందించటమే కాదు.. సాయం సంగతి తర్వాత షాక్ అయ్యేలా చేశారు.

పుణేకు చెందిన ఒక వ్యక్తి చిన్నమ్మను సాయాన్ని కోరారు. ఇంతకీ ఆ సాయం ఏమిటంటే.. తన భార్య ఝూన్సీ రైల్వే స్టేషన్ పని చేస్తోందని.. తాను పుణెలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని.. తన భార్యను పుణెకు బదిలీ చేసేందుకు సాయం చేయాల్సిందిగా కోరారు. ఈ అభ్యర్థనపై సుష్మా స్వరాజ్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఇంటి ప్రశ్నలు అడుగుతావా? అని మండిపడటమే కాదు.. తన శాఖకు చెంది ఉంటే నీ భార్యను సస్పెన్షన్ ఆర్డర్ పంపేదాన్ని అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అక్కడితో ఆగని ఆమె.. తనకొచ్చిన ట్వీట్ ను రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు కూడా పంపించారు. దీనిపై బదులిచ్చిన ఆయన.. ఇలాంటివి తన దృష్టికి తెచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూనే.. బదిలీ వ్యవహారాల్ని రైల్వే బోర్డు చూస్తుందని పేర్కొన్నారు. కోరినంతనే సాయం చేసే చిన్నమ్మతో  సాయం పొందాలని భావించిన సదరు ఐటీ ఉద్యోగికి ఆమె ఆగ్రహంషాక్ తగిలేలా చేసిందనటంలో సందేహం లేదు. ముందు వెనుకా చూసుకోకుండా.. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం అడిగే సాయాలు అసలుకే ఎసరు తెస్తాయన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News