సుష్మా - సుమిత్ర - ఉమాభారతి..ఆ బాధ్యతలెవరికి!

Update: 2019-06-03 16:19 GMT
కర్ణాటక గవర్నర్‌ గా బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతిని నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ - లోక్‌ సభ మాజీ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో కేవలం కర్ణాటకలో మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ అధిష్టానం కూడా దక్షిణాదిన కర్ణాటక పై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈమేరకు తాజా లోక్‌ సభ ఎన్నికల్లో కూడా బీజేపీ 25 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అయితే కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులు పలుమార్లు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.

సెప్టెంబర్‌ వరకు పదవీకాలం

ప్రస్తుతం ఉన్న గవర్నర్‌ వీఆర్‌ వాలా పదవీకాలం వచ్చే సెప్టెంబరుతో ముగియనుంది. అయితే అంతకుముందే ఆయనను తప్పించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రులు ఉమాభారతి - సుష్మాస్వరాజ్ - లోక్‌ సభ మాజీ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. గత 2014 - సెప్టెంబర్‌ 1న గవర్నర్‌ గా వజుబాయి వాలా బాధ్యతలు స్వీకరించారు. కానీ సంకీర్ణ ప్రభుత్వం కూల్చి బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్‌ వీఆర్‌ వాలా సహకరించలేదనేది బీజేపీ నాయకుల వాదన. ఈ క్రమంలో సాగనంపేందుకు సిద్ధమయ్యారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించలేదనే..

కర్ణాటకలో ఆపరేషన్‌ కమల్‌ నిర్వహించాల్సి వస్తే సరైన వ్యక్తి గవర్నర్‌ గా ఉంటే పని సులువుగా ఉంటుందని బీజేపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వజుభాయి రుడాబాయ్‌ వాలా చాలా సౌమ్యుడిగా పేరు ఉన్న నాయకుడు కావడంతో ఆయన ఆచితూచి వ్యవహరిస్తారని.. ఆపరేషన్‌ కమల నేపథ్యంలో దుడుకుగా దూసుకెళ్లె గవర్నర్‌ అయితే బాగుంటుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త గవర్నర్‌ గా కేంద్ర మాజీ మంత్రులు ఉమాభారతి - సుష్మాస్వరాజ్ - మాజీ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ లో ఎవరో ఒకరిని నియమించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరో వారం రోజుల్లో స్పష్టమైన సమాచారం వెల్లడించనున్నట్లు సమాచారం. కర్ణాటకలో గతంలో 25 ఏళ్ల క్రితం రమాదేవి అనే మహిళా గవర్నర్‌ పని చేశారు. ఆ తర్వాత మహిళా గవర్నర్‌ రాలేదు.
Tags:    

Similar News