కోమ‌టి రెడ్డి - సంప‌త్ ల సస్పెన్ష‌న్ పై స‌స్పెన్స్!

Update: 2018-08-08 11:19 GMT
కొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ లను టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం  స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతూ వారిద్ద‌రూ కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో, ఆ ఇద్ద‌రిని శాసనసభలోకి అనుమతించాలంటూ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్త‌ర్వులు చూపించినా త‌మ‌ను శాస‌న స‌భ‌లోకి అనుమ‌తించ‌డం లేదంటూ కోమటి రెడ్డి - సంపత్‌ కుమార్ లు ....తెలంగాణ స‌ర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్ప‌డింద‌ని ఆరోపిస్తూ కోర్టులో పిటిష‌న్ వేశారు. దీంతో,తామిచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని తెలంగాణ అడిషనల్‌ అడ్వకేట్ జనరల్ రామచందర్‌ రావును హైకోర్టు ప్ర‌శ్నించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగింది.

హైకోర్టు సింగిల్ జ‌డ్చి బెంచ్ ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ....డివిజ‌న‌ల్ బెంచ్ విచార‌ణ జ‌ర‌పాలంటూ ప్ర‌భుత్వం త‌ర‌ఫున తెలంగాణ అడిషనల్‌ అడ్వకేట్ జనరల్ రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు...ఆగ‌స్టు 16కు విచార‌ణ వాయిదా వేసింది.

ఈ నేప‌థ్యంలో, కోమ‌టి రెడ్డి - సంప‌త్ లు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్టేట్లు క‌నిపిస్తోంది. వారి రీఎంట్రీపై సస్పెన్స్ ను తెలంగాణ స‌ర్కార్ కొన‌సాగిస్తోంది. అయితే, ఈ పిటిష‌న్ విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత డివిజ‌న్ బెంచ్ కూడా కోమ‌టి రెడ్డి - సంప‌త్ ల‌కు అనుకూలంగా తీర్పునిస్తే....అది తెలంగాణ స‌ర్కార్ కు ఎదురు దెబ్బ అవుతుంది. అందుకోసం...ఈ వ్యవ‌హారంలో సాధ్య‌మైనంత జాప్యం జ‌రిగేలా తెలంగాణ స‌ర్కార్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ పిటిష‌న్ ల విచార‌ణ పూర్త‌యి....తీర్పు వ‌చ్చేస‌రికి....అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిపోతాయ‌ని....దీంతో, వారు అసెంబ్లీలో అడుగుపెట్టే అవ‌కాశం ఉండ‌ద‌ని కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.
Tags:    

Similar News