జ‌డ్డీల‌ను త‌ప్పించాలా.. కుద‌ర‌ద‌న్న సీజే!

Update: 2021-11-15 08:16 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం హాట్ టాపిక్‌గా మారింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన వంద‌కు పైగా పిటిష‌న్ల‌పై హైకోర్టు తిరిగి విచార‌ణ ప్రారంభించ‌డ‌మే అందుకు కార‌ణం. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా ప్ర‌క‌టించి దాని నిర్మాణం కోసం ఆ చుట్టుప‌క్క‌ల ఉన్న రైతుల నుంచి భూమి సేక‌రించి ప‌నులు మొద‌లెట్టిన సంగ‌తి తెలిసిందే. కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పాల‌న వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో అమ‌రావ‌తితో పాటు క‌ర్నూలు, విశాఖ‌ప‌ట్నం క‌లిపి మూడు రాజ‌ధానులు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. జ‌గ‌న్ నిర్ణ‌యానికి కార్య‌నిర్వాహ‌క‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల నుంచి ఆమోదం ల‌భించిన‌ప్ప‌టికీ న్యాయప‌రంగా లైన్ క్లియ‌ర్ కావాల్సి ఉంది. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా వంద‌లాది పిటిష‌న్లు హైకోర్టులో దాఖ‌ల‌వ‌డ‌మే అందుకు కార‌ణం.

తొలిరోజే ట్విస్ట్‌..

జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్ల‌పై హైకోర్టులోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం తిరిగి విచార‌ణ ప్రారంభించింది. పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్‌డీఏ ర‌ద్దును స‌వాలు చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రుగుతోంది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు మ‌రో ఇద్ద‌రు జడ్జీలు జ‌స్జిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, జ‌స్జిస్ సోమ‌యాజులతో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం వీటిపై విచార‌ణ జ‌ర‌పుతోంది. అయితే తొలిరోజే ఈ త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం నుంచి స‌త్య‌నారాయ‌ణ మూర్తి, సోమ‌యాజుల‌ను త‌ప్పించాల‌ని ప్ర‌భుత్వ త‌ర‌పున న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. రాజ‌ధానిలో ఆ ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌కు భూములు ఉన్నాయ‌ని వాళ్ల‌ను ఈ విచార‌ణ నుంచి త‌ప్పించాల‌ని ఆ న్యాయ‌వాది కోరారు. కానీ అందుకు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అంగీక‌రించ‌లేదు. గ‌తంలో ఇవే పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ప్పుడు ఎందుకు అభ్యంత‌రం తెల‌ప‌లేద‌ని ఇప్పుడు ఆ న్యాయ‌మూర్తుల‌ను త‌ప్పించాల‌నే వాద‌న‌తో ఏకీభ‌వించ‌డం లేద‌ని ధ‌ర్మాసనం స్ప‌ష్టం చేసింది.

ఈ సారి పూర్త‌యేనా?

మూడు రాజ‌ధానులకు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్లపై హైకోర్టులో విచార‌ణ సాగుతూ వ‌స్తోంది. గ‌తంలో రెండు సార్లు విచార‌ణ ప్రారంభ‌మై మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇప్పుడు మూడోసారి తిరిగి ఆరంభ‌మైన విచార‌ణ ఇప్పుడైనా పూర్తయేనా అని రాజ‌ధాని రైతులు పిటిష‌న్ దాఖ‌లు చేసిన వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా చేప‌ట్టిన విచార‌ణ సంద‌ర్భంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. రాజ‌ధాని కేసుల విచార‌ణ‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంద‌ని ఈ సుదీర్ఘ విచార‌ణ వ‌ల్ల రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయిన‌ట్లు అనిపిస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. క‌క్షిదారుల‌తో పాటు అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు అనిపిస్తోందని ఈ పిటిష‌న్ల‌పై సాధ్య‌మైనంత త్వ‌ర‌గా విచార‌ణ పూర్తి చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News