మ‌హేష్ ను మార్చి తీరుతాం:ప‌రిపూర్ణానంద‌

Update: 2018-07-04 16:44 GMT
రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్య‌లు ఇరు తెలుగు రాష్ట్రాల‌లో పెను దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ తీరుపై ప‌లువురు మండిప‌డుతున్నారు. క‌త్తి మ‌హేష్ చేసిన వ్యాఖ్య‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోకుంటే ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని సినీ న‌టుడు నాగ‌బాబు కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌హేష్ వ్యాఖ్య‌ల‌పై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు  పరిపూర్ణానందస్వామి అల్టిమేటం జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ పై పరిపూర్ణానంద స్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌హేష్ హిందువు కానప్పుడు - హిందూమతం జోలికి ఎందుకు వస్తున్నారని ఆయ‌న అన్నారు. బాబు గోగినేని ఒక ఉన్మాదపు క్రీడ అని - దానికి  కత్తి మహేష్ పరాకాష్ట అని అన్నారు. రామాయ‌ణం గురించి ఇటువంటి వ్యాఖ్య‌లు చేసి...స‌భ్య సమాజానికి ఏం చెప్పదలచుకున్నారని ప్రశ్నించారు. కత్తిమహేష్ డ‌బ్బుకు అమ్ముడుపోయి ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని మండిపడ్డారు. మ‌హేష్ కు రాముడు దగుల్బాజీ... వర్మ దేవుడు అని ఎద్దేవా చేశారు. ధర్మాన్ని - దేవతలను - గ్రంథాలను కించ‌ప‌రిస్తే చూస్తూ  ఊరుకోన‌ని పరిపూర్ణానంద హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ...అటువంటి వారికి త‌గిన బుద్ధి చెప్పేందుకు తాము ముందుకు వ‌స్తామ‌న్నారు.

అలా అని మ‌హేష్ పై భౌతిక దాడులు - కొట్ట‌డాలు - తిట్ట‌డాలు వంటివి చేయ‌బోమ‌ని - అప‌రిప‌క్వ‌త ఉన్న వ్య‌క్తులు అటువంటి నీచ‌మైన ప‌నులు చేస్తార‌ని అన్నారు. హింసా ప్ర‌వృత్తిని తాను పూర్తిగా వ్య‌తిరేకిస్తాన‌ని అన్నారు. హిందుత్వంపై మ‌హేష్ లో ఉన్న ప్ర‌మాద‌క‌ర భావ‌జాలానికి తాను వ్య‌తిరేక‌మ‌ని, వ్య‌క్తిగతంగా ఆయ‌న‌పై త‌న‌కు ఎటువంటి ద్వేషం లేద‌ని అన్నారు. ఒక కుక్క మ‌హేష్ పై దాడి చేయ‌డానికి వ‌స్తే సాటి మ‌నిషిగా మ‌హేష్ ను తాను కాపాడ‌తాన‌ని అన్నారు. మ‌హేష్ తో పాటు హిందుత్వం పై ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసేవారు ...వారంత‌ట వారే మారేలాగా క‌ట్టుదిట్ట‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్నామ‌న్నారు. వారు మార‌క త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌ను క‌ల్పిస్తామ‌న్నారు. బీజేపీ త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థిగా ప‌రిపూర్ణానంద పోటీ చేయ‌బోతున్నార‌ని వ‌స్తోన్న ఊహాగానాల‌పై ప‌రిపూర్ణానంద స్పందించారు. బీజేపీ అంటే...కాషాయం...హిందూత్వం వంటి విష‌యాల‌కు ప్రాధాన్య‌త ఇస్తుంది.......ప‌రిపూర్ణానంద స్వామి కూడా హిందూధ‌ర్మం మీద నిల‌బ‌డ్డారు  కాబ‌ట్టి అటువంటి ఊహాగానాలు వ‌స్తున్నాయని, అందులో త‌ప్పేమీ లేదని అన్నారు. అయితే, తాను నిమిత్త మాత్రుడ‌నేన‌ని, దైవ నిర్ణ‌యం ఎలా ఉంటే అలా జ‌రుగుతుంద‌ని ఆ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు.
Tags:    

Similar News