ఆ ఇద్ద‌రిని కేసీఆర్‌ ఎందుకు తీసుకెళ్లిన‌ట్లు?

Update: 2015-09-08 12:40 GMT
ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే స‌మ‌యంలో త‌న వెంట మంత్రులు.. నేత‌లు.. అధికారులు ఇలా ప‌లువురిని తీసుకెళుతుంటారు. గ‌తంలో అయితే..విదేశీ ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌ను అప్పుడ‌ప్పుడు తీసుకెళ్లేవారు. పెరిగిన మీడియా హ‌డావుడి పుణ్య‌మా అని.. అస‌లు ఆ ఆలోచ‌న‌నే వ‌దిలేశారు.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చైనా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. యాభై మంది ప్ర‌యాణించేందుకు అనువుగా ఉన్న ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకొని మ‌రీ వెళ్లిన కేసీఆర్ త‌న‌తో పాటు.. అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి.. శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ ల‌ను తీసుకెళ్ల‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

అసెంబ్లీ స్పీక‌ర్ కాని.. శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ కానీ ప్ర‌భుత్వానికి అతీతంగా.. రాష్ట్రంలోని అన్ని పార్టీల నుంచి ఎన్నికైన స‌భ్యుల‌కు పెద్ద‌దిక్కుగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే వారి పాత్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేన‌ట్లుగా ఉంటుంది. అలాంటిది అందుకు భిన్నంగా ఇరువురిని త‌న‌తో తీసుకెళ్ల‌టం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. నిజానికి అసెంబ్లీ స్పీక‌ర్ కానీ.. శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ కానీ త‌మ‌కున్న వెసులుబాటుతో కొన్ని స‌మావేశాల్లో పాల్గొనేందుకు విడిగా విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసే వీలుంది. అయిన‌ప్ప‌టికీ.. ముఖ్య‌మంత్రి త‌న‌తో ఇద్ద‌రు ప్ర‌ముఖుల్ని తీసుకెళ్లిన వైనం చూసిన‌ప్పుడు కేసీఆర్ వైఖ‌రి కాస్తంత చిత్రంగా అనిపించ‌క‌మాన‌దు.

ఈ వ్య‌వ‌హారంపై విప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. భ‌యంతోనే వారిద్ద‌రిని తీసుకెళ్లిన‌ట్లుగా జోకులేసుకుంటున్నారు. తాను విదేశాల‌కు వెళ్లిన స‌మ‌యంలో రాజ‌కీయంగా ఏదైనా అనుకోని ప‌రిణామాలు ఏర్ప‌డి.. కీల‌క‌మైన స్పీక‌ర్ ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే ఎలా అన్న సందేహంతోనే త‌న వెంట తీసుకెళ్లిన‌ట్లుగా స‌ర‌దాగా చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. ఏది ఏమైనా.. అసెంబ్లీ స్పీక‌ర్‌.. మండ‌లి ఛైర్మ‌న్ ల‌ను త‌న‌తో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు తీసుకెళ్ల‌టం కేసీఆర్‌కే చెల్లింద‌న్న వ్యాఖ్య వినిపిస్తోంది.
Tags:    

Similar News