బాబుపై ఆ స్వామీజీ మ‌ళ్లీ ఫైర‌య్యాడు

Update: 2016-07-03 04:24 GMT
విజయవాడలో హిందూ దేవాలయాలను రాత్రికి రాత్రే కూల్చివేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టం అని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. రుషీకేష్‌ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామి స్వ‌రూపానందేంద్ర ఈ మేర‌కు ఒక ప్రకటన జారీ చేశారు. దేవాలయాల నిర్మాణమైనా - వాటిని తొలగించాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే జరగాలన్నారు. దేవాలయాలను బలమైన కారణాలతో తొలగించాలని ప్రభుత్వం భావిస్తే, తొలుత అన్ని కోణాల్లో పరిశీలించాలని - హిందూమత పెద్దలు - పీఠాధిపతులు తదితరులతో చర్చించాలని సూచించారు.

హిందూ దేవాలయాలపై ఉగ్రవాదులుకాని - అన్యమతస్తులు కాని దాడి చేసినా - కించపరిచినా హిందూసమాజం యావత్తూ అడ్డుకుంటుందని స్వరూపానందేంద్ర హెచ్చ‌రించారు. హిందూ సమాజానికి రక్షణ కల్పించేవారికి దేశప్రజలంతా కలిసి అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు. కానీ నవ్యాంధ్రప్రదేశ్‌ లో మరీ ముఖ్యంగా రాజధాని హోదాలో విలసిల్లుతున్న విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో - రోడ్ల విస్తరణ పేరుతో 30 కిపైగా దేవాలయాలను రాత్రికి రాత్రే కూల్చివేయడం దుర్మార్గమని స్వరూపానందేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూల్చిన ఆలయాల్లో స్వయంభూ ఆలయాలు - రుషులు ప్రతిష్ఠ చేసిన ఆలయాలు మరికొన్ని, కారణజన్ములైన ఆదిశంకరాచార్యులు - రామానుజాచార్యులు - మధ్వాచార్యులు తదతర మహానుభావుల చేతులమీదుగా ప్రతిష్ఠ జరిగిన ఆలయాలు కూడా ఉన్నాయన్నారు. ఆలయాల కూల్చివేతను ప్రశ్నించిన వారిని దూషిస్తున్నారని పేర్కొంటూ, ఈ విధానం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే స్పందించాలని స్వరూపానందేంద్ర కోరారు.
Tags:    

Similar News