చంద్రబాబుపై స్వరూపానంద సరస్వతి ఫైర్

Update: 2016-11-28 11:34 GMT
చంద్రబాబు పేరు వినిపిస్తే చాలు నిప్పులు చెరిగే విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి మరోసారి ఏపీ ప్రభుత్వం - చంద్రబాబుపై నేరుగా విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబుది దౌర్భాగ్యపు పరిపాలన అంటూ ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన చంద్రబాబు ప్రభుత్వం, ఏపీ దేవాదాయ శాఖపై నిప్పులు చెరిగారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ఏపీ దేవాదాయ శాఖ ఏమాత్రం బుద్ది లేకుండా పనిచేస్తోందని అన్నారు. ఆచారాలు, సంప్రదాయాలకు పాతరేసి దేవాలయాలకు చెందిన కోట్లాది రూపాయలను పుష్కరాల పేరుతో వృథాగా ఖర్చు చేసిందని విమర్శించారు. విజయవాడలో 40దేవాలయాలను కూల్చివేసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం ఏపీలో పాలన సాగిస్తోందని... చివరకు ఆలయ భూములను కూడా కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల సమయంలో టీడీపీకి సానుకూలంగానే ఉన్న స్వరూపానందేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎందుకో చంద్రబాబు అంటే చాలు మండిపడడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా ఆయన మీడియాతో మాట్లాడితే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు.  ఆలయాలకు సంబంధించిన అంశాలే కాకుండా రాజధాని అమరావతి విషయంలోనూ ఆయన పలుమార్లు చంద్రబాబు చర్యలను తప్పుపట్టారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News