భార‌త్ లో లంచాల బాగోతం.. అందుకే కంపెనీ మూసుకున్నాం!

Update: 2021-03-11 02:30 GMT
విదేశాల నుంచి విమానాల కొనుగోళ్లు మొద‌లు ప‌లు.. విష‌యాలపై గ‌తంలో ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా.. బ‌స్సుల కొనుగోళ్ల విష‌యంలోనూ లంచాల వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డింద‌ని, అందుకే భార‌త్ లో త‌మ కంపెనీని కూడా మూసిన‌ట్టు ప్ర‌క‌టించింద‌ట స్కానియా! ఈ మేర‌కు ప్ర‌చారం సాగుతోంది. స్వీడ‌న్ కు చెందిన ఈ బ‌స్సుల త‌యారీ సంస్థ స్కానియా.. వోక్స్ వ్యాగ‌న్ గ్రూప్ కంపెనీల్లో ఒక‌టిగా ఉంది.

2013 నుంచి 2016 మ‌ధ్య కాలంలో భార‌త్ లోని ఏడు రాష్ట్రాల్లో బ‌స్సు కాంట్రాక్టుల కోసం త‌మ ఉద్యోగులు.. ప్ర‌భుత్వ అధికారుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు లంచాలు ఇచ్చిన‌ట్టు ఆ కంపెనీ గుర్తించింద‌ట‌. లంచాలు పుచ్చుకున్న వారిలో ఓ మంత్రి కూడా ఉన్నాడ‌ట‌. స్వీడ‌న్‌, జ‌ర్మనీకి చెందిన మీడియా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింద‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఇండియాలోని ఆయా రాష్ట్రాల్లో బస్సు కాంట్రాక్టుల కోసం త‌మ కంపెనీ ప్ర‌తినిధులు ముడుపులు ఇవ్వాల్సి వ‌చ్చిన‌ ఘ‌ట‌న‌లు సుమారు 20 వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ట‌. త‌మ కంపెనీ బ‌స్సుల‌కు కాంట్రాక్టు ఇవ్వ‌డానికి అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దాదాపు 77,300 డాల‌ర్ల మేర లంచాలు ఇచ్చిన‌ట్టు కంపెనీ అంత‌ర్గ‌త విచార‌ణ‌లో వెల్ల‌డైన‌ట్టు తెలుస్తోంది. మ‌రికొన్ని వాహ‌నాల‌కు త‌ప్పుడు ప‌త్రాలు త‌యారు చేసి, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆధీనంలో ప‌నిచేసే సంస్థ‌ల‌కు అమ్మేసిన‌ట్టుగా కూడా తేలింద‌ట‌.

ఈ విష‌యం తెలియ‌డంతో భార‌త్ లో త‌మ కంపెనీ బ‌స్సుల అమ్మకాల‌ను నిలిపేశామ‌ని, ఇండియాలోని త‌మ ఫ్యాక్ట‌రీని కూడా ఈ కార‌ణంతోనే మూసేశామ‌ని స‌ద‌రు స్కానియా కంపెనీ ప్ర‌క‌టించింద‌ట‌. అంతేకాకుండా.. ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న కాంట్రాక్టుల‌న్నీ ర‌ద్దు చేసుకున్న‌ట్టు కూడా స‌ద‌రు కంపెనీ తెలిపింద‌ట‌. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింద‌ట‌.

గ‌తంలో వోక్స్ వ్యాగ‌న్ కార్ల‌కు సంబంధించిన‌ కుంభ‌కోణం జ‌రిగింద‌ని ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ ఇప్పుడు కూడా అదే గ్రూప్ న‌కు చెందిన కంపెనీ వాహ‌నాల కొనుగోళ్ల‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఆరోప‌ణ‌లు రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత‌? పాత్రధారులు ఎవరు? అన్న‌ది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News