బ్లాక్ బాబుల‌కు స్విస్ షాక్‌

Update: 2015-08-31 05:09 GMT
న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త చ‌ట్టం న‌ల్ల‌ధ‌న అస్వాముల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మీ సొమ్ము గుట్టుగా మా వ‌ద్ద దాయ‌డం క‌ష్టం..మీ ఆస్తుల వివ‌రాలు ప్ర‌భుత్వానికి మీరే చెప్పుకోండంటూ స్విస్ బ్యాంకుల నుంచి ఆదేశాలు వ‌స్తుండ‌డంతో ఏం చేయాలో తెలియ‌క వారు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మోడీ ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన చ‌ట్టం ప్ర‌కారం విదేశీ బ్యాంకుల్లో అక్ర‌మ ఖాతాలున్న‌వారు వ‌చ్చే నెలాఖ‌రులోగా ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాలి. అలా తెలియ‌జేసిన న‌ల్ల‌ధ‌న అస్వాముల‌కు మాత్రం 30 శాతం ప‌న్ను..30 శాతం పెనాల్టీ విధించి శిక్ష‌లేకుండా వ‌దిలేస్తారు. సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కే ఈ గ‌డువు. అక్టోబ‌ర్ 1 నుంచి అక్ర‌మాస్తుల‌పై 30 శాతం ప‌న్నుతో పాటు 90 శాతం పెనాల్టీ విధిస్తారు. 10 సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష ఉంటుంది.

ఈ రెండు దేశాల ప్ర‌భుత్వాల మ‌ధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా స్విస్ బ్యాంకుల్లో అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్న భార‌తీయుల చిట్టాను ఆ బ్యాంకులు ప్ర‌భుత్వానికి అంద‌జేస్తాయి. గ‌డువు తేదీలోగా వారంత‌ట వారు స్వ‌యంగా త‌మ ఆస్తుల వివ‌రాలు ప్ర‌భుత్వానికి తెలియ‌జేస్తే త‌క్కువ పెనాల్టీతో శిక్ష లేకుండా బ‌య‌ట‌ప‌డ‌తారు. లేని ప‌క్షంలో భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష కూడా త‌ప్ప‌దు. దీంతో న‌ల్ల‌ధ‌న అస్వాముల ప‌రిస్థితి ముందు నుయ్యి వెన‌క గొయ్యి అన్న చందంగా మారింది. త‌మంత‌ట తాము ఆస్తుల వివ‌రాలు చెప్పినా కోట్లాది రూపాయ‌లు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్నందున అలాగూ భారీ పెనాల్టీ చెల్లించ‌క‌త‌ప్పేలా లేదు...కాదూ కూడ‌ద‌నుకుంటే స‌ర్వం కోల్పోయి జైలు శిక్ష అనుభ‌వించాలి.

లండ‌న్ బ్యాంకులు సైతం ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇక‌పై భార‌త్‌ కు చెందిన న‌ల్ల‌ద‌నాన్ని తాము దాయ‌లేమ‌ని ఓపెన్‌ గా చెప్పేస్తున్నాయి. దీంతో న‌ల్ల‌ధ‌న అస్వాముల తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు. ఇన్ని రోజులు తాము ఎంతో క‌ష్ట‌ప‌డి దాచుకున్న బ్లాక్‌ మ‌నీ బండారం భ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో వారు క‌క్క‌లేకుండా మింగ‌లేకుండా ఏం చేయాలా...ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.
Tags:    

Similar News