కేసీఆర్ వార్నింగ్ వాళ్ల‌కిలా అర్థ‌మైంది

Update: 2017-08-07 16:58 GMT
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన జీఎస్టీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒంటికాలిపై లేస్తున్న సంగ‌తి తెలిసిందే.  త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా జీఎస్టీ అమ‌లు తీరు ఉంద‌ని మండిప‌డుతున్న కేసీఆర్‌ అవ‌స‌ర‌మైతే ఈ విష‌యంలో కేంద్రంపై న్యాయ‌పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు - అధికారుల‌తో వ‌రుస స‌మావేశాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు. అయితే కేసీఆర్ పిలుపును తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కొత్త కోణంలో విశ్లేషించారు. తాజాగా పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ల‌క్ష్మ‌ణ్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెండు రోజులుగా జీఎస్టీపై చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు.

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు ప్రజలను తప్పుదోవ పట్టించే విదంగా ఉన్నాయని ల‌క్ష్మణ్ అన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ - సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ జీఎస్టీ నిర్ణయాల్లో భాగస్వాములని ఆయ‌న తెలిపారు. అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతోనే తీసుకున్న నిర్ణయాలు ఇవ‌ని పేర్కొన్నారు. కేంద్రం సొంత నిర్ణ‌యం అన్న‌ట్లుగా అపాదించడం కేసీఆర్‌ కు తగదని స్ప‌ష్టం చేశారు. జీఎస్టీ కౌన్సిల్ లో అన్ని రాష్ట్రాలు ఉన్నాయని, ఈ నిర్ణయాల్లో రాష్ట్రాల భాగస్వామ్యం ముఖ్యమైనద‌ని తెలిపారు. సీఎం కేసీఆరే స్వయంగా గ‌తంలో త‌మ ప్రమేయంతోనే 28 శాతం నుండి 12 శాతానికి జీఎస్టీ తగ్గిందని అన్నారని ల‌క్ష్మ‌ణ్ గుర్తు చేశారు.

కేంద్రం మీద పోరాటం చేస్తున్నామని ప్రజలకు చెప్పడానికే కేసీఆర్ ఇలా చెప్పార‌ని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. రోజు రోజుకు తెలంగాణలో బీజేపీ ఎదుగుతోందని భావించడం వ‌ల్ల బీజేపీ మీద బురద జల్లే కార్యక్రమంగా జీఎస్టీని సీఎం కేసీఆర్ ఎంచుకున్నార‌ని తెలిపారు. కాంగ్రెస్ కనుమరుగు అవుతోందనే, బీజేపీ బ‌లోపేతం కావ‌ద్ద‌నే కోణంలోనే సీఎం వ్యాఖ్యలు ఉన్నాయ‌ని ల‌క్ష్మ‌ణ్ విశ్లేషించారు. జీఎస్టీ దేశ భవిష్యత్తు అని, కేంద్రం ఆదుకుంటుందని అసెంబ్లీ హాల్ లో చెప్పిన  సీఎం కేసీఆర్ ఇప్పుడు .ఎందుకు మాట మార్చరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్నపళంగా సీఎం ఉలిక్కి పడి ఎందుకు ప్రకటన చేశారో అర్థం కావ‌డం లేద‌న్నారు. ఏదైనా సరే అదనంగా భారం పడితే లెక్కలు ముందు పెట్టాల‌ని రాష్ట్రం కోసం బీజేపీ బాధ్యత తీసుకుంటుంద‌ని అన్నారు.

జీఎస్టీ అమల్లోకి వచ్చాక వస్తువులపై రేట్లలో మార్పులు చేర్పులు వచ్చాయని ల‌క్ష్మ‌ణ్‌ వివ‌రించారు. అనేక అంశాలపై సమీక్ష జరిపి రేట్ల లో మార్పులు తెచ్చారని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం కోసం, ఇతర పథకాల కోసంరెండు లక్షల 30 వేల  కోట్లు వెచ్చిస్తుందని.. ఇందులో 19 వేల కోట్లు అదనంగా భారం అని సీఎం కేసీఆర్ చెప్పివ‌న్నీ తప్పుడు లెక్కలని ల‌క్ష్మ‌ణ్ చెప్పారు. సీఎం స్థాయి లో ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు లెక్కలు చెప్పడం భావ్యం కాదన్నారు. సిమెంట్-కంకర-స్టీల్ లాంటి వస్తువులపై .. 10 శాతం పన్ను తగ్గిందని ఇంకా భారం అంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశం తోనే చేసినట్టు కనిపిస్తోందని అన్నారు. ఎటువంటి లెక్కలు పరిగణలోకి తీసుకోకుండా ఆశాస్త్రీయంగా సీఎం ప్రకటన చేయ‌డం ఎలా సబబని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రాల వారిగా ఇంకా భారం పడే అంశాలను జీఎస్టీ కౌన్సిల్ లో మాట్లాడటానికి అవకాశం ఉన్న ఎందుకు పోరాటం పిలుపు అని ప్ర‌శ్నించారు. ముందే పోరాటం - సమరం - న్యాయ పోరాటం అనడం విడ్డురమ‌ని తెలిపారు. ఒక‌వేళ అభ్యంత‌రాలు ఉంటే వచ్చే సమావేశంలో ఒప్పించాలని ల‌క్ష్మ‌ణ్ సూచించారు. అవ‌సరమైతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి..ఆ నివేదికను జీఎస్టీ కౌన్సిల్ లో ఒప్పించాలని అన్నారు.
Tags:    

Similar News