మీడియా ఉంటే నెగ్గవచ్చుననుకుంటే భ్రమే!!

Update: 2015-01-21 06:25 GMT
సద్ది బువ్వ తినలేదు కానీ... చితక్కొట్టేద్దును అన్నాట్ట వెనకటికి ఒకడు! అలా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల పరిస్థితి! తెలంగాణ తెచ్చింది మేము, ఇచ్చింది మేము అని కేవలం మీడియా ముందు మాత్రమే చెప్పుకుని, ప్రజల్లోకి ఆ విషయాన్ని పూర్తిగా తీసుకెళ్లడంలో నూటికి నూరుశాతం ఫెయిల్‌ అయిన టి.కాంగ్రెస్‌ నేతలు... మాకు కానీ ఒక ఛానల్‌ కానీ ఉంటేనా అని కొత్త పాటపాడుతోన్నారు! కాంగ్రెస్‌ పార్టీకంటూ ప్రత్యేకంగా ఒక టీవీ ఛానల్‌, ఒక దినపత్రిక ఉండాలని తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చిన దిగ్విజయ్‌ సింగ్‌ దగ్గర చెప్పుకోస్తోన్నారు! ప్రజలు పార్టీనీ, నాయకుడిని విశ్వసించాలంటే కావాల్సింది.. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం... మాకు ఫలానా నాయకుడు ఉన్నాడులే అని ఆ ప్రజలు దైర్యంగా చెప్పుకోగలగడం! ఈ విషయంలో పూర్తిగా విఫలమయిన టి.కాంగ్రెస్‌ నాయకులు... ఒక ప్రత్యేక ఛానల్‌ ఉంటే మాత్రం చాలా బాగుంటోంది, అది పార్టీని బలపరచడానికి, అధికారంలోకి రావడానికి సహకరిస్తాదని చెప్పుకొస్తోన్నారు!

ప్రజాదరణ ఉన్న వారికి ఛానెల్‌, పత్రిక వంటివి కొంత ఉపకరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లేని ఆదరణను తెచ్చిపెట్టడం అనేది పది ఛానెళ్లు, 20 పత్రికలు ఉన్నా కూడా సాధ్యం కాదు అనేది సత్యం. నాయకత్వ బలం లేకుండా, ప్రజల్లో విశ్వాసం సంపాదించుకోలేకుండా... కేవలం మీడియా మీద ఆధారపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఈ సమయంలో పాపం టి.కాంగ్రెస్‌ నాయకులు ఒక విషయం మరిచిపోతోన్నారు! తమ కంటూ సొంత పత్రిక, సొంత ఛానల్‌ ఉండి, ఎన్నికల సమయంలో నిత్యం అదే పనిమీద ఉండే వైకాపా పరిస్థితి ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ ఎలా పుట్టిమునిగిపోయిందో టి.కాంగ్రెస్‌ నేతలకు తెలియదని అనుకోలేం! ఒకటి కంటే ఎక్కువ భజన ఛానల్స్‌, దిన పత్రిక లు ఉన్న తెలుగుదేశం పరిస్థితి తెలంగాణలో ఏమయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఈ విషయాలన్నీ విజ్ఞులైన తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు తెలియదా? ప్రజలు పార్టీని విశ్వసించాలంటే, ఆ నాయకులను నమ్మాలి అంటే... కావాల్సింది టీవీ ఛానలో, దిన పత్రికో కాదనే సత్యాన్ని ఈ నాయకులు నమ్మే రోజు రావాలని సగటు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటోన్నారు!
Tags:    

Similar News