హుజూరాబాద్ పై కాంగ్రెస్ పక్కా ప్లాన్

Update: 2021-08-05 03:40 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు హుజూరాబాద్ వైపై ఉంది. ఇక్కడి నియోజకవర్గం నుంచి మంత్రిగ పనిచేసిన ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కాగా..ఆ తరువాత ఎమ్మెల్యే పదవి, టీఆర్ఎస్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ తరువాత ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజీపీ పోటా పోటీగా ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నాయి. ఓ వైపు ఈటల రాజేందర్ పాదయాత్రతో ప్రజలందరినీ కలుస్తూ ఉండగా టీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఒడిదొడుకుల మధ్య సాగిన కాంగ్రెస్ పార్టీ కొత్త పాలకవర్గం నియామకంతో జోష్ నింపినట్లయింది.టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటగెలిచి రచ్చ గెలువాలన్న సామెత ద్వారా పార్టీలో అసంతృప్తులు లేకుండా చేసిన రేవంత్ ఇక ఎన్నికల్లో పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఇందులో భాగంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతాపం చూపించేందుకు రేవంత్ రెడ్డి అనేక వ్యూహాలు పన్నుతున్నాడు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంతో దళితుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆ సమాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రభుత్వం దళిత బంధు పేరిత పథకాన్ని ప్రారంభించింది. కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతామంటూ ప్రచారం చేస్తోంది. మరోవైపు యాదవులకు గొర్ల పంపిణీ చేసి ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటోంది. మిగతా వారికి సైతం ఏదో ఒక రకంగా పథకం వర్తించేలా ప్రయత్నిస్తోంది.

ఇక దళిత బందు తో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తానే కారణమని ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారు. నా ఒక్క రాజీనామాతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అందుకు నేనే కారణమని అంటున్నారు. ఇలా ప్రజల మధ్యకు పాదయాత్ర ద్వారా వెళుతూ ప్రచారం చేస్తున్నారు.  అయితే ఇటీవల మోకాని ఆపరేషన్ కారణంగా పాదయాత్రకు బ్రేక్ పడింది. ఇదంతా ప్రజలకోసమేనని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం కూడా చూపించాలని ఆ పార్టీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించిన దామోదర నర్సింహ పార్టీ మీటింగ్లు పెడుతూ పార్టీ కార్యకర్తలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా దళితులను ఆకట్టుకోవడానికి టీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న ప్రయత్నాలకు ధీటుగా కాంగ్రెస్ మరో వ్యూహం రచిస్తోంది.

ఇక్కడి ఉప ఎన్నికల్లో భాగంగా ఏకంగా దళిత అభ్యర్థినే నిలబెడితే కొంత లాభం చేకూరే అవకాశాలుండొచ్చని భావిస్తున్నారు.  ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎవరనేది స్ఫష్టమైన వైఖరి లేదు. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అయితే  దామోదర నర్సింహను బరిలోకి దించుతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని దామోదర కొట్టిపారేశారు. దీంతో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ లేదా మరో అభ్యర్థిని బరిలోకి దించే ప్రయత్నాలు చేస్తోంది. గెలుపోటములు పక్కనబెడితే ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ప్రభావం ఉందన్న రీతిలో పనిచేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
Tags:    

Similar News