లాజిక్ మిస్స‌వుతున్న టీ కాంగ్రెస్ సీనియ‌ర్లు..!

Update: 2022-01-17 02:48 GMT
తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు లాజిక్ మిస్స‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి నిర్ణ‌యాల‌ను అడ్డుకొని త‌మ సీనియారిటీని చూపించుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ జూనియ‌ర్ అయిన రేవంత్ ను ప్ర‌తిక్ష‌ణం ఇబ్బంది పెట్టేందుకే ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ ఇది మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని మాత్రం గ‌మ‌నించ‌క‌లేక‌పోతున్నారు.

ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చి తెలంగాణ‌లో అధికారం చేప‌ట్టాల‌న్న కాంగ్రెస్ ను ప్ర‌తీసారి దుర‌దృష్టం వెంటాడుతోంది. వ్ర‌తం ఒక‌రు చేస్తే ఫ‌లితం మ‌రొక‌రు అనుభ‌వించిన విధంగా మారింది కాంగ్రెస్ ప‌రిస్థితి. తెలంగాణ ఇచ్చింది సోనియా అయితే.. అధికారాన్ని మాత్రం గులాబీ పార్టీ అనుభ‌విస్తోంది. రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాన‌ని మాట ఇచ్చి మోసం చేశారు కేసీఆర్‌. ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా గుర్తించినా ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది హ‌స్తం పార్టీ.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఎప్ప‌టికైనా త‌న‌కు ప్ర‌మాద‌మేన‌ని గ‌మ‌నించిన కేసీఆర్ క్ర‌మంగా హ‌స్తం పార్టీని నిర్వీర్యం చేస్తూ వ‌చ్చారు. ఈ విష‌యాన్ని హ్యాండిల్ చేయ‌డంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు విఫ‌ల‌మ‌య్యారు. రాష్ట్రం ఇస్తే తెలంగాణ‌లో కాంగ్రెస్ కు ఇక తిరుగుండ‌ద‌ని సోనియా ఎదుట బాకా ఊదారు. కానీ ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.

పొన్నాల ల‌క్ష్మయ్య పీసీసీ అధ్య‌క్షుడు ఉన్న‌ప్పుడు రాష్ట్రం ఏర్పాటైనా ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత ఉత్త‌మ్‌ ఏడు సంవ‌త్స‌రాలు పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్నా ప‌రిస్థితిలో మార్పు రాలేదు. రెండోసారి కూడా విజ‌యానికి దూరంగా ఉండిపోయారు. ఇదంతా పార్టీలో ఉన్న గ్రూపు త‌గాదాలు.. వ‌ర్గ విభేదాల వ‌ల్లేన‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

క‌నీసం కొత్త అధ్య‌క్షుడు రేవంత్ వ‌చ్చినా మార్పు క‌నిపిస్తుంద‌నుకుంటే ఇక్క‌డా అదే ప‌రిస్థితి. పార్టీ సీనియ‌ర్లు కొంద‌రు త‌న‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేదు. అధిష్ఠానం త‌మ‌ను చిన్న‌చూపు చూసింద‌ని అల‌క‌బూనారు. రేవంత్ త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకొని వ్య‌క్తిగ‌తంగా ఎదిగేందుకు తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని వాపోతున్నారు.

కానీ రేవంత్ వ‌ర్గం వాద‌న మ‌రోలా ఉంది. పార్టీలో ఉన్న కోవ‌ర్టు రాజ‌కీయాల‌తో కొన్ని నిర్ణ‌యాలు అప్ప‌టిక‌ప్పుడు ఏక‌ప‌క్షంగా తీసుకోవాల్సి వ‌స్తోంద‌ని రేవంత్ వ‌ర్గం అంటోంది. అలాగే.. రేవంత్ ఎదిగితే త‌ను ఒక్క‌రే ఎదిగిన‌ట్లు కాద‌ని.. పార్టీకి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని.. పార్టీ అధికారంలోకి వ‌స్తే అంద‌రికీ ప‌ద‌వులు వ‌స్తాయని రేవంత్ అనుచ‌రులు చెప్ప‌కుంటున్నారు. ఈ చిన్న లాజిక్ ను సీనియ‌ర్లు అర్థం చేసుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు.
Tags:    

Similar News