ఎర్ర‌గడ్డ‌@సెక్ర‌టేరియ‌ట్‌, అసెంబ్లీ, మండ‌లి

Update: 2016-02-29 10:04 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌చివాల‌యం త‌ర‌లింపుపై ఒక్క శాతం కూడా వెన‌క్కిత‌గ్గ‌క‌పోగా... న‌యా సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణంపై వేగంగా త‌న అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు స్థ‌లాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేసీఆర్ ఇపుడు తుదినిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ద‌ఫా ఏకంగా రాష్ట్ర సచివాలయం - శాసనసభ - శాసనమండలికి ఎర్ర‌గ‌డ్డ‌ను కేంద్రంగా డిసైడ్ చేశారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన త‌ర్వాత‌ కేసీఆర్ ప్రస్తుత సచివాలయంలో వాస్తు దోషాలు ఉన్నాయ‌ని భావించారు. నూతన సచివాలయం నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు వివిధ స్థలాలు పరిశీలించి ఎర్రగడ్డలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెస్ట్ ఆసుపత్రి స్థలం దానికి అనువైనదని భావించారు. అయితే ప్రతిపక్షాలు ఈ విషయంపై దుమ్మెత్తిపోయ‌డ‌మే కాకుండా న్యాయప‌రంగా పోరాటం చేశాయి. దీంతో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ స్థలాలపై దృష్టి సారించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బైసన్ పోలో గ్రౌండ్స్ కూడా అనువుగా ఉంటుందని భావించి కేంద్రంతో పలుదఫాలుగా సంప్రదింపులు జరిపారు. ప్రత్యామ్నాయంగా గోల్కొండ ఖిల్లా వద్ద తగినంత స్థలం కేటాయిస్తామని చెప్పారు. అయితే రక్షణశాఖ సానుకూలంగా స్పందించ లేదు. దీంతో బైసన్ గ్రౌండ్స్ ప్రతిపాదన దాదాపుగా విరమించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఎర్రమంజిల్‌ లో ఉన్న 30 ఎకరాల స్థలాన్ని కూడా సీఎం పరిశీలించారు. కానీ ప్రతిపాదించిన స్థాయి సచివాలయం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒక దశలో ప్రస్తుత సీఎం నివాస సముదాయం ఉన్న స్థలంపై కూడా ఆలోచించారు. నగరంలో పెద్ద స్థలాలు ఎక్కడా లేకపోవడంతో తిరిగి చెస్ట్ ఆసుపత్రిలోనే సచివాలయం నిర్మించాలనే ఆలోచనకు సీఎం కేసీఆర్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే చెస్ట్ ఆసుపత్రి సమీపంలో ఉన్న మానసిక వికలాంగుల ఆసుపత్రి కూడా విశాలమైన స్థలంలో ఉండటంతో దాన్ని తరలించి ఆ స్థలంలో శాసనసభ, శాసనమండలి నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల మీద సమీక్షలు జరుగుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆర్ అండ్ బీ ఆధికారులతో సెక్రటేరియట్ - అసెంబ్లీ - కౌన్సిల్ నిర్మాణాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు సోమవారం ఉన్నత స్థాయి అధికారులు ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి నిర్మాణ‌రంగంలో పేరున్న‌ ముంబైకి హఫీజ్ కాంట్రాక్టర్ హైదరాబాద్‌ కు వస్తున్నట్లు తెలిసింది.
Tags:    

Similar News