ప‌ద్మన్న మాట‌!... వారు తాగితే మేమేం చేస్తాం!

Update: 2017-11-01 04:29 GMT
తెలంగాణ‌లో మ‌ద్యం విక్ర‌యాల‌కు సంబంధించి ఆ రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి ప‌ద్మారావు గౌడ్ చాలా ఆస‌క్తిక‌ర‌మైన వాద‌న వినిపించారు. నిన్న‌టి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల సాక్షిగా ఆయ‌న వినిపించిన వాద‌న నిజంగానే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని చెప్పాలి. అయినా ప‌ద్మారావు ఏమ‌న్నారన్న విష‌యానికి వ‌స్తే... *రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల్లో వృద్ధి న‌మోదైతే... దానికి మేమేం చేయ‌గ‌లం. మద్యం అమ్మకాల ద్వారా రూ.21 వేల కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న బీజేపీ సభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదు. అయినా రాష్ట్రంలో గుడుంబా నివార‌ణ‌కు ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ప‌నిచేస్తోంది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే 98 శాతం మేర ఫ‌లితాల‌ను సాధించాం* అని ప‌ద్మారావు క‌న్ఫ్యూజ‌న్‌ గా మాట్లాడారు. గుడుంబా విక్ర‌యాల‌ను అరిక‌డితే... జ‌నం మ‌ద్యం వైపు దారి మ‌ళ్లిపోయార‌ని ప‌ద్మారావు చాలా క్లారిటీగానే చెప్పేశారు. అయితే ఈ విష‌యాన్ని ఎక్క‌డ కూడా ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌గా గుడుంబాను అరిక‌ట్టేశామ‌ని - మ‌ద్యం విక్ర‌యాలు పెరిగితే మాత్రం తామేం చేస్తామ‌ని... స‌మాధానం చెబుతూనే ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు.

గుడుంబా నివార‌ణ స‌రే... మ‌రి మ‌ద్యం మ‌హమ్మారి బారిన ప‌డి కుటుంబాలు నాశ‌న‌మ‌వుతున్న వైనం ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దా? అన్న ప్ర‌శ్న ఇక్క‌డ ఉద‌యిస్తోంది. ఇక వాస్త‌వ ప‌రిస్థితిని ఓసారి ప‌రిశీలిస్తే... మద్యం విక్ర‌యాలు తెలంగాణ‌లో భారీగానే పెరిగాయి. మునుప‌టిలా గుడుంబా ల‌భ్యం కాక‌పోవ‌డంతో మందుబాబులు మ‌ద్యం షాపుల వ‌ద్ద వాలిపోతున్నారు. వారికి కిక్కు కావాలంతే. మ‌రి గుడుంబా దొర‌క‌క‌పోతే... ఊరికే కూర్చోరుగా... ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తోనే ఏర్పాటైన మ‌ద్యం షాపుల వ‌ద్ద‌కు ప‌రుగులు పెడుతున్న జ‌నం గుడుంబా కంటే కాస్తంత అధిక మొత్తాల‌ను వెచ్చించి మ‌రీ మ‌ద్యం కొనుగోలు చేస్తున్నారు. ఫ‌లితంగా ట్యాక్స్ రూపేణా ప్ర‌భుత్వానికి ఇబ్బడిముబ్బ‌డిగా నిధులు వ‌చ్చి ప‌డుతున్నాయి. అంటే మ‌ద్యం విక్ర‌యాల వ‌ల్ల వ‌చ్చే లాభాల‌ను ప్ర‌భుత్వం త‌న ఖ‌జానాలో వేసుకుంటున్న‌ట్టే క‌దా. అలాంట‌ప్పుడు మ‌ద్యం విక్ర‌యాల‌తో ఇంత మేర ఆదాయం ఆర్జించాల‌ని తామేమీ ల‌క్ష్యం పెట్టుకోలేదంటూ ప‌ద్మారావు చెప్పిన మాట‌లో ఎంత‌మేర వాస్త‌వ‌ముందో ఇట్టే ప‌సిగ‌ట్టేయొచ్చు.

అంతేకాకుండా అప్ప‌టిదాకా అమ‌ల్లో ఉన్న మ‌ద్యం పాల‌సీని పూర్తిగా మార్చేసిన కేసీఆర్ స‌ర్కారు... మద్యం విక్ర‌యాల్లో భారీ పెరుగుద‌ల న‌మోద‌య్యేలా నిబంధ‌న‌ల‌ను మార్చేసి కొత్త మ‌ద్యం పాల‌సీని తీసుకొచ్చింద‌ని ఇప్ప‌టికే విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. కొత్త మ‌ద్యం పాల‌సీ కార‌ణంగానే తెలంగాణ‌లో మ‌ద్యం విక్ర‌యాలు ఊపందుకున్నాయ‌న్న వాద‌న‌లోనూ వాస్త‌వ‌ముందంటూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌ద్యం విక్ర‌యాల వ‌ల్ల ఇంత‌మేర ఆదాయాన్ని ఆర్జించాల‌ని తామేమీ ల‌క్ష్యం నిర్దేశించుకోలేద‌ని ప‌ద్మారావు చెప్ప‌డం అబద్ధ‌మే క‌దా. అయినా బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేట‌ప్పుడు అన్ని శాఖల మారిదే ఆబ్కారీ శాఖ ద్వారా ఇంత ఆదాయం వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పేస్తుంది క‌దా. మ‌రి ఆబ్కారీ శాఖ‌కు ఆదాయం ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? మ‌ద్యం విక్ర‌యాల ద్వారానే క‌దా. ఈ మాట‌ను అటు తిప్పి, ఇటు తిప్పి... *మ‌ద్యం విక్ర‌యాలు పెరిగితే మేమేం చేస్తాం. జ‌నం కొంటున్నారు, తాగుతున్నారు... దానికి బాధ్య‌త మాదా?* అన్ని రీతిలో ప‌ద్మారావు చేసిన ప్ర‌సంగం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు.
Tags:    

Similar News