కోదండ‌రాంతో జ‌ట్టుక‌ట్టిన టీటీడీపీ

Update: 2015-10-17 06:33 GMT
ఒక‌ప్పుడు పాలు నీళ్ల‌లా క‌లిసి ఉన్న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఛైర్మన్‌(టీజేఏసీ)కోదండరాం, తెలంగాణ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావుల మ‌ధ్య దూరం పెరిగిందా? ప్రొఫెసర్‌ గా పదవీ విరమణ చేసిన స‌మ‌యంలో  చెప్పిన‌ట్లు ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారా?  రైతుల ప‌క్షాన కోదండ‌రాంకు తెలుగుదేశం మ‌ద్ద‌తు ఇవ్వ‌నుందా? అంటే...తాజా పరిణామాలు అవుననే స‌మాధానం చెబుతున్నాయి. అన్నదాతల ఆత్మహత్యలపై కోదండరాం హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటీషన్‌ వేయడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పుడు అంతటా కోదండరాం పిటీషన్‌ చర్చనీయాంశంగా మారి తెలంగాణవాదులతో పాటు మేధావుల్లో ఆసక్తి రేపుతోంది. అందరి మెదళ్లు తొలుస్తోంది.

న్యాయస్థానంలో తెలంగాణ విద్యావంతుల వేదిక తరుపున పిటీషన్‌ వేసినట్లు చెబుతూనే.. ప్రభుత్వ విధానాలు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉన్నాయని.. స్వామినాథన్‌ కమిటీ నివేదికను పట్టించుకోవడం లేదని కోదండ‌రాం తన పిటీషన్ లో పేర్కొనడం చూస్తుంటే ప్రభుత్వంపై పోరు చేస్తాననే సంకేతాలను పరోక్షంగా పంపించారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవల్సి ఉందని, దీనిపై తాము సమగ్ర సర్వే జరిపామని, ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలతో కూడిన నివేదిక ఉందని ఆ పిటీషన్‌ లో పేర్కొనడంతో ఇప్పటికే ప్రతిపక్షాలు అధికార పార్టీని ఎండగడుతూ ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్‌ సర్కార్‌ కు కోదండరాం కూడా తోడుకావడం సర్కార్‌ ను మరింతగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజల గొంతుకై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా మారుతున్నారని ప్రస్తుతం రాజకీయాల్లో హాట్‌ హాట్‌ చర్చ సాగుతోంది.

ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న కాలంలో టీజేఏసీ సారధిగా తెలంగాణ సమాజాన్ని కోదండ‌రాం ఏకతాటిపైకి తెచ్చారు. అలా తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమికను పోషించిన కోదండరాం..ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత తన ప్రొఫెసర్‌ వృత్తిని కొనసాగిస్తూ అప్పు డప్పుడు తెలంగాణ ప్రజల సమస్యల గురించి అధికార పార్టీని ప్రశ్నించేవారు. అయితే, ప్రొఫెసర్‌ పోస్టు నుంచి దిగిపోయిన వేళ.. తాను ప్రొఫెసర్‌ ఉద్యోగం నుంచి మాత్రమే రిటైర్‌ అవుతున్నానే తప్ప.. ప్రజా జీవితం నుంచి, ఉద్యమాల నుంచి రిటైర్డ్‌ కావడం లేదని చెప్పినట్లుగా ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నట్లు తాజాగా అన్నదాతల ఆత్మహత్యలపై న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలు చేయడం ద్వారా స్పష్టంగా కనబడుతోంది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమికను పోషించిన కోదండరాం పదవీ విరమణ తరువాత ప్రజాపక్షంగా ఉంటారా? అధికార పక్షంగా ఉంటారా? లేదంటే, ఏదైనా కొత్త పార్టీ పెడతారా? అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగింది. అయితే, అన్నదాతల ఆత్మ హత్యలపై ఇంప్లీడ్‌ పిటీషన్‌ వేసి కేసీఆర్‌ కు షాకిచ్చే విధంగా దూకుడు ప్రదర్శిస్తున్నట్లు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆయన వైఖరి చూస్తుంటే మాత్రం సర్కార్‌ పై పోరుకే మొగ్గును చూపెడుతున్నట్లు వేరే చెప్పనక్కర్లేదు. టీజేఏసీ ఛైర్మన్‌ గా కొనసాగుతూనే ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. దీంతోనే అన్న దాతల ఆత్మహత్యలపై న్యాయస్థానంలో తెలంగాణ విద్యావంతుల వేదిక తరుపున పిటీషన్‌ వేసినట్లు చెబుతున్నప్పటికీ..భవిష్యత్‌ లో మాత్రం ప్రజా సమస్యలన్నింటిపైనా పోరాడటానికి మానసికంగా సిద్దమైనట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

అన్నదాతల ఆత్మహత్యలు సర్కార్‌ చేతగాని తనం వల్లే జరుగుతున్నాయనీ హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటీషన్‌ వేయడం సర్కార్‌ కు షాక్‌ ఇచ్చేందుకు ఆయన మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో ప్రజాసమస్యలపై పోరాడాలన్న ఉద్దేశంతో ఉన్న తెలంగాణ టీడీపీ కోదండ‌రాంతో జ‌ట్టుకట్టింది. పార్టీ రాష్ర్ట అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌, ప‌లువురు నేత‌లు తాజాగా కోదండ‌రాంతో స‌మావేశ‌మ‌య్యారు. రైతుల కోసం చేసే ఏకార్య‌క్ర‌మానికి అయినా మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News