అపుడు ముంబైకి.. ఇప్పుడు టీమిండియాకు కెప్టెన్ గా

Update: 2021-11-18 09:43 GMT
పాత గుర్తులు ఎప్పుడూ పదిలమే.. అవి మధురమైనవేతే మరింతగా గుర్తుంటాయి. మన దగ్గరి వారు, బంధువులు వాటిని చెబుతుంటే ఇంకా ఇప్పుడే జరిగినట్టు అనిపిస్తుంది. ఇలాంటి అనుభవమే తాజాగా టీమిండియా టి20 కెప్టెన్ రోహిత్ శర్మకు ఎదురైంది. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ఓపెనింగ్ చేస్తూ రోహిత్ కీలక బ్యాట్స్ మన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ టి20 ఫార్మాట్ సారథిగా పగ్గాలందుకున్నాడు. వాస్తవానికి విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకుంటానని ప్రకటన చేసినప్పుడు టీమిండియాకు కాబోయే బాస్ రోహితేనని అంతా అనుకున్నారు.

అయితే, అతడికి 35 ఏళ్లుండడం, టి20 ఫార్మాట్ కుర్రాళ్లకే ఎక్కువ నప్పుతుంది అనే భావనతో రోహిత్ కు సారథ్యం ఇస్తారా? ఇవ్వరా? అనే చర్చ సాగింది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఆఖరికి పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు సైత వినిపించింది. అయితే, అనుభవం, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను నడిపించిన తీరు చూసి రోహిత్ కే టీ20 కెప్టెన్సీ దక్కింది.

ప్రస్తుత పరిస్థితుల్లో రోహితే ఇందుకు తగినవాడు కూడా. రాహుల్ అద్బుత బ్యాట్స్ మనే అయినా, నిలకడపై ఇంకా అనుమానాలున్నాయి. పంత్ ను కొన్నాళ్లు పరీక్షించడంలో తప్పులేదు. తిరుగులేని పేసర్ బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడం అంటే అతడిపై మరింత భారం మోపినట్టే. కాబట్టే రోహిత్ కు వయసు ఎక్కువైనా సారథ్యం ఇవ్వడంలో తప్పులేదు.

సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం

దేశవాళీ క్రికెట్ రారాజు ముంబై. ఆ జట్టుకు గతంలో ఎందరో దిగ్గజాలు ఆడారు. మిగతా రాష్ట్రాల్లో విజయవంతం కానివారు ముంబైకి మారిపోయి ఆ రంజీ జట్టుకు ఆడి వెలుగులోకి వచ్చేవారు. ఇక స్వతహాగానే ముంబై రంజీ జట్టు సభ్యుడైన రోహిత్ ఓ దశలో సారథ్యం కూడా వహించాడు. అప్పుడు ఇప్పుడు కాదు. ఏకంగా తొమ్మిదేళ్ల క్రితమే ముంబై కెప్టెన్ గా వ్యవహరించాడు.

అప్పుడూ జైపూర్ నుంచే .. నవంబరులోనే

2012 నవంబరు 7న రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన రంజీ మ్యాచ్ లో కెప్టెన్ గా ముంబై జట్టును రోహిత్ నడిపించాడు. వాస్తవానికి అప్పుడు కెరీర్ పరంగా కొంత వెనుకంజలో ఉన్నాడు. 2007 టి20 ప్రపంచకప్ లో అరంగేట్ర మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికాపై అర్ధ శతకం బాది జట్టు గెలుపులో కీలకంగా నిలిచాడు రోహిత్. 2008 ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదరగొట్టాడు.

దీంతో టీమిండియాకు ఓ గొప్ప బ్యాట్స్ మన్ దొరికాడని భావించారు. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. 2011 ప్రపంచ కప్ జట్టులో చోటే దక్కలేదు. రోహిత్ తర్వాత వచ్చిన కోహ్లి కి స్థానం దక్కడం గమనార్హం. అలాంటి సమయంలోనే రోహిత్ ముంబై రంజీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు.

ఆ ట్వీట్.. నేటి మ్యాచ్

అనుకోకుండానో ఏమో గానీ రోహిత్ పూర్తి స్థాయి టి20 కెప్టెన్ టీమిండియాగా తొలి మ్యాచ్ వేదిక జైపూర్ కావడం విశేషం. న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా సునాయాసంగానే విజయం సాధించింది. అయితే, 2012 నవంబరులో తొలిసారి ముంబై కెప్టెన్ గా వ్యవహరించిన సందర్భంలో రోహిత్ చేసిన ట్వీట్ ను సందర్భోచితంగా ఓ అభిమాని ఇప్పుడు ప్రస్తావించడం ఇక్కడ గమనించదగిన విషయం.

నాడు కెప్టెన్ గా తొలిసారి మైదానంలో దిగే సందర్భంలో.. ‘‘జైపూర్ వచ్చేశాం. నేను ముంబై జట్టును నడిపించబోతున్నా. అదనపు బాధ్యతల కోసం ఎదురుచూస్తున్నా’’ అంటూ రోహిత్ చేసిన ట్వీట్ ను అతడు మళ్లీ ప్రస్తావించాడు. ఇప్పడదే ట్వీట్ ను గుర్తు చేస్తూ ‘‘మొదటిసారి రోహిత్ పూర్తి స్థాయి టి20 కెప్టెన్ గా భారత్ కు నాయకత్వం వహించనున్నాడు’’ అంటూ అభిమాని ట్వీట్ చేశాడు.

ఇంతకూ ఆ మ్యాచ్ ఏమైందంటే..

తొమ్మిదేళ్లు దాటిపోయినా.. ఆ అభిమాని నాటి సందర్భాన్ని గుర్తుచేసుకుని మరీ ట్వీట్ చేయడం ఓ విశేషమేతే, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని తొమ్మిదేళ్ల అనంతరం రోహిత్ టీమిండియా టి20 ఫుల్ టైం కెప్టెన్ గా అదే జైపూర్ లో జట్టును నడిపించడం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం. నిన్నటి మ్యాచ్ లో భారత జట్టు గెలవగా.. మరి నాటి రంజీ మ్యాచ్ ఫలితం ఏమందైనే సందేహం వస్తుంది కదా? రాజస్థాన్ - ముంబై మధ్య జరిగిన ఆ మ్యాచ్ డ్రా గా ముగిసింది. మొదట రాజస్థాన్ 478 పరుగులకు ఆలౌటవగా ముంబై 579 పరుగులు చేసి ఆలౌటైంది.

కెప్టెన్ రోహిత్ శర్మ 79 పరుగులతో రాణించాడు. అన్నట్టు.. ప్రస్తుత టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ అదే తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్. నాటి మ్యాచ్ లో ప్రస్తుత టీమిండియా హార్డ్ హిట్టర్ సూర్య కుమార్ యాదవ్ కూడా ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు.
Tags:    

Similar News