ఈ రోజు జరిగే భారత్ - పాక్ మ్యాచ్ లో గెలుపు అవకాశాలు ఎవరివి?

Update: 2021-10-24 06:39 GMT
రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ ను యావత్ ప్రపంచం ఆసక్తిగా చూసే అవకాశం ఉంటుందా? అది కూడా క్రికెట్ మ్యాచ్ అంటే.. ఉంటుందనే చెప్పాలి. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు మీద క్రికెట్ మీద పెద్దగా ఆసక్తి లేని వారు సైతం తుది ఫలితం గురించి ఒక చెవి వేసి ఉంచుతారనటంలో సందేహం లేదు. బంతి బంతికీ హార్ట్ బీట్ పెంచుతూ.. ఉక్కిరిబిక్కిరి చేసే ఉత్కంటతో ఊగిపోతూ.. మ్యాచ్ మొత్తాన్నిచూసే వారంతా తుది ఫలితం తమకు అనుకూలంగా ఉండాలనుకోవటం తెలిసిందే. క్రీడాభిమానులకు ఇదో మ్యాచ్ గా కనిపించినా.. ఇరు దేశాల అభిమానులకు మాత్రం స్టేడియంలో జరిగే రియల్ యుద్ధంగానే భావిస్తారు. టోర్నీ చేజారినా ఫర్లేదు కానీ.. పాక్ తో జరిగే ప్రతిష్ఠాత్మక మ్యాచ్ లో మాత్రం విజయం చేజారద్దన్నట్లుగా అంచనాలు ఉంటాయి. అందుకే. దాయాది మధ్య జరిగే క్రికెట్ పోరు ఎప్పటికి ఇస్పెషలే.

చాలా కాలం తర్వాత భారత్ - పాక్ మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఈ రెండు దేశాలు తలబడపోతున్నాయి. ఈ రోజు (ఆదివారం) రాత్రి  7.30 గంటలు (భారత కాలమానం ప్రకారం) మొదలయ్యే ఈ మ్యాచ్ కు అందరూఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తీవ్రమైన భావోద్వేగాలకు ప్రతిరూపంగా నిలిచే ఈ మ్యాచ్ లో తమ సత్తా చాటేందుకు ఇరు జట్ల క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. ఢీ అంటే ఢీ అన్నట్లు సాగే ఈ పోటీలో అధిక్యత ఎవరివది? తుది విజయం ఎవరి సొంతం కానుందన్న దానిపై పెద్ద ఎత్తున అంచనాలు వినిపిస్తున్నాయి. వాటిల్లోకి వెళితే..

ఐసీసీ టోర్నీల్లో పాక్ మీద భారత్ అధిపత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వన్డే ప్రపంచకప్ పోటీల్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఏడుసార్లు పోటీ పడితే ఏడుసార్లు విజయం సాధించింది. ఇక.. టీ20 వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య పోరు ఐదుసార్లు జరిగితే.. అన్నీ మ్యాచుల్లోనూ విజయం సాధించింది. టీ 20ఫార్మాట్ లో ఈ రెండు జట్లు మొత్తంగా ఎనిమిది మ్యాచ్ లు అడితే భారత్ ఏడింటిలో గెలవగా.. పాక్ ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య క్రికెట్ పోటీలు బంద్ అయి చాలా కాలమే అయ్యింది. అయితే.. ఐసీసీ టోర్నీలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతుంటాయి. ఆ సమయాల్లో తీవ్రమైన భావోద్వేగం మధ్య ఆట నడుస్తుంటుంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో గ్రూపు-2లో భాగంగా భారత్ - పాక్ లు తలపడపోతున్నాయి. ఇరు జట్లు తొలి మ్యాచ్ లో సరైన బోణీ కొట్టాలన్న ఆశతో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య చివరి పోరు 2019లో జరిగిన వరల్డ్ కప్ లో తలపడ్డాయి. ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ కు సంబంధించి రెండు జట్ల బలాబలాలు.. గెలుపు అవకాశాల్ని చూస్తే..

టీ20 ప్రపంచ కప్ లో దాయాది పోరుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫార్మాట్ లో పాక్ తో జరిగే మ్యాచ్ కు తొలిసారి కోహ్లీ టీంను లీడ్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ ఫార్మాట్ లో కెప్టెన్ గా ఇదే అతని ఆఖరి టోర్నీ కూడా. అందుకే.. ఈ మ్యాచ్ ను ఒక మంచి గురుతుగా ఉంచుకోవాలన్న ఆరాటం కోహ్లీలో కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ టోర్నీలో దాయాదితో తలపడిన వేళలో జట్టుకు ధోనీ కెప్టెన్ గా ఉన్నారు.

టీమిండియా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉండటం సానుకూలంశం. ఓపెనర్లు రోహిత్.. రాహుల్ టాప్ ఫామ్ లో ఉండటం కలిసొచ్చే అంశం. పేసర్ షహీన్ షా అఫ్రీదిని  ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబడితే.. మిడిల్ ఆర్డర్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ నెంబర్ త్రీగా ఎంట్రీ ఇవ్వటం ఖాయం.

ఐసీసీ టోర్నీలో భారత్ పైన తమకు విజయాలు లేని నేపథ్యంలో పాక్ ఆ మాటను మార్చాలన్న పట్టుదలతో ఉంది.ఈ జట్టు ఈసారి అద్భుతమైన ఫామ్ లో ఉంది. పాక్ టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉండటం కలిసొచ్చే అంశం. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్.. కెప్టెన్ ఆజమ్ లు ఈ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 2 ప్లేయర్లు కావటం వారికి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. నెంబర్ త్రీగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఫఖర్ జమాన్ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. రెండు వార్మప్ మ్యాచుల్లో అతను 98 పరుగులు చేశాడు.

పోటాపోటీగా సాగే ఈ మ్యాచ్ లో పిచ్ కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో భారీ స్కోర్ కు అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఏదైనా ఫీల్డింగ్ కే మొగ్గు చూపటం ఖాయం. ఇక్కడ చేజింగ్ చేసే జట్లకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచు మ్యాచ్ ను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. మొత్తంగా దాయాది పోరు ఈసారి కూడా పోటాపోటీగా.. నరాలు తెగేంత ఉత్కంట రేపేలా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. విజయం పై రెండు జట్ల కెప్టెన్లు పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరేం జరుగుతుందన్నది ఈ రాత్రికి తేలిపోనుంది.
Tags:    

Similar News