బంగ్లా భయపెట్టినా.. భారతే బెబ్బులి... ప్రపంచ కప్ మ్యాచ్ లో ఘన విజయం

Update: 2022-11-02 14:07 GMT
ప్రపంచ కప్, కీలక టోర్నీల్లో ఇప్పటివరకు భారత్ కు పాకిస్థాన్ తోనే టగ్ ఆఫ్ వార్ లాంటి మ్యాచ్ లు జరిగేవి. ఇకపై బంగ్లాదేశ్ నూ ఆ జాబితాలో చేర్చాలేమో..? బుధవారం టి20 ప్రపంచకప్ మ్యాచ్ ను చూస్తే ఈ విషయం అవుననే అనిపిస్తోంది. ఆరేళ్ల కిందట భారత్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో చివరి బంతికి మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత మేధస్సుతో విజయం సాధించిన భారత్.. బుధవారం సైతం అదే తరహా సమరంలో గెలుపొందింది.  చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. లిట్టన్‌ దాస్‌ విజృంభణతో ఓ దశలో భారత్‌ ఓడిపోతుందేమోనని ఆందోళన  కలిగినప్పటికీ.. ఆపై బౌలర్లు పుంజుకోవడంతో రోహిత్‌ సేన గట్టెక్కింది.

టాస్‌ ఓడిపోయి టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్ చేయగా విరాట్‌ కోహ్లీ 64*, కేఎల్‌ రాహుల్‌ 50, సూర్యకుమార్‌ 30 రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆపై బంగ్లా బ్యాటింగ్‌కు రాగా.. ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ (60; 7 ఫోర్లు, 3 సిక్స్ లు) చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. అయితే, రెండో ఇన్నింగ్స్ ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కురవడంతో ఈ ఇన్నింగ్స్‌ను 16 ఓవర్లకు కుదించారు. ఆఫ్‌ సెంచరీ సాధించి ఊపుమీదున్న దాస్‌ను కేఎల్‌ రాహుల్‌ రనౌట్‌ చేయడంతో మ్యాచ్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. భారత బౌలర్లు పుంజుకొని వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్‌ టీమ్‌ఇండియా వశమైంది. ఈ గెలుపుతో టీమ్‌ఇండియా సెమీస్‌కు మరింత చేరువైంది.

మ్యాచ్ కుదింపు గెలుపు చేరువః

ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింగ్ వర్షం కురవడం. ఏడు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసిన బంగ్లాదేశ్ 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందని అనిపించింది. కానీ, వర్షం కురిశాకఅంతా మారిపోయింది. వర్షం అనంతరం బంగ్లా లక్ష్యాన్ని 54 బంతుల్లో 85గా నిర్ణయించారు. అయితే, ఇలా తిరిగి ప్రారంభమైందో లేదో.. రాహుల్ విసిరిన అద్భుత త్రోకు లిటన్ దాస్రనౌటయ్యాడు. ఇది భారత్ ను పోటీలోకి తెచ్చింది. మరో ఓపెనర్ నజ్ముల్ శాంతో (21) ఓ సిక్స్ కొట్టి భయపెట్టినా.. షమీ అతడి ఆట కట్టించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకొచ్చి జట్టునుగెలిపిద్దామని ప్రయత్నించిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ (13) ఓ భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. అప్పటికి సమీకరణం 25 బంతుల్లో 51.

కానీ.. పోరాడింది

షకిబ్ తర్వాత రెండు బంతులకే యాసిర్ అలీ (1) వెనుదిరిగినా.. మొసద్దక్ హొస్సేన్ (6) వస్తూనే సిక్స్ కొట్టాడు. అయితే, ఆ వెంటనే వెనుదిరిగాడు. 18 బంతుల్లో 43 పరుగులు అవసరమైన స్థితిలో అర్షదీప్ 12 పరుగులిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో హార్దిక్ 11 పరుగులిచ్చాడు. చివరకు సమీకరణం 6 బంతుల్లో 20 పరుగులుగా మారింది. నూరుల్ హసన్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్), తస్కిన్ అహ్మద్ (12) క్రీజులో ఉండడం.. చివరి ఓవర్ రెండో బంతిని నూరుల్ సిక్స్, ఐదో బంతిని ఫోర్ కొట్టడంతో ఉత్కంఠ పెరిగింది. పైగా కొత్త బౌలర్ అర్షదీప్ చేతిలో బంతి ఉండడంతో మరింత టెన్షన్ గా మారింది. చివరి బంతికి సిక్స్ కొడితే టైగా మారే పరిస్థితి వచ్చింది. అయితే, నూరుల్ సింగిల్ మాత్రమే కొట్టాడు. దీంతో భారత్ ఐదు పరుగులతో గెలిచింది. వాస్తవానికి మ్యాచ్ ఆగిపోయే సమయానికి బంగ్లా డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 49 పరుగులు చేస్తే చాలు. కానీ, తిరిగి ప్రారంభమయ్యాక సమీకరణం మారింది. మరోవైపు మ్యాచ్ తిరిగి ప్రారంభంపై బంగ్లా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. కానీ, అంపైర్లు నిర్వహణకే మొగ్గుచూపారు.

సెమీస్ కు ముందంజ

బంగ్లాదేశ్ పై గెలుపుతో టీమిండియా ప్రపంచ కప్ సెమీస్ కు మరింత చేరువైంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించిన భారత్.. దక్షిణాఫ్రికా కంటే ముందుంది. గురువారం దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ తలపడనున్నాయి. భారత్ ఆదివారం జింబాబ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో మన జట్టు గెలుపు ఖాయం. మ్యాచ్ రద్దయినా.. ఏడు పాయింట్లతో సెమీస్ కు వెళ్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News