ట్రక్కును ఢీకొట్టి పట్టాలు తప్పిన రైలు.. 36మంది మృతి

Update: 2021-04-02 06:07 GMT
తైవాన్ దేశంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. తూర్పు తైవాన్ లోని టోరోకో జార్జ్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది మృతిచెందారు. మరో 72మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయానికి రైల్లో మొత్తం 350మంది ప్రయాణికులు ఉన్నారు.

తైతుంగ్ కు వెళుతున్న రైలు ఉత్తర హౌలైన్ సమీపంలో సొరంగం వద్ద పట్టాలు తప్పినట్టు తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది. మూడు దశాబ్ధాల తర్వాత జరిగిన ఈ అతిపెద్ద రైలు ప్రమాదంగా తైవాన్ ప్రభుత్వం పేర్కొంది.

ప్రమాదం సమాచారం అందగానే పోలీసులు, అధికారులు, సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు సొరంగం లోపల భారీ శబ్ధం వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. సొరంగం వద్ద పట్టాల పక్కనే ఓ ట్రక్కును నిలిపి ఉంచారని.. దీనివల్లే రైలు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

పట్టాలు తప్పిన రైలు పక్కనే ఓ ట్రక్కు ఉన్నట్టు వీడియోలు, ఫొటోల్లో కనిపిస్తోంది. ట్రక్కును ఢీకొట్టిన రైలు తర్వాత పట్టాలు తప్పిందని తెలిపారు. ట్రక్కు మొత్తం తునాతునకలు కాగా.. రైలు ముందు భాగం సొరంగం వెలుపల ఉంది. లోపల భోగీల్లో ఉన్న వారిని వెలికి తీస్తున్నారు.
Tags:    

Similar News