పాయింట్ ప‌ట్టుకున్న కేటీఆర్

Update: 2022-12-28 04:30 GMT
ఎమ్మెల్యేల‌కు ఎర కేసులో తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ త‌గిలింది కోర్టులో. ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సిట్‌ను కేసు నుంచి త‌ప్పించి సీబీఐ చేతికి ఇవ్వ‌డం సంచ‌ల‌నం రేపింది. ఇప్ప‌టిదాకా ఈ కేసులో ఇబ్బంది ప‌డుతూ వ‌చ్చిన బీజేపీ.. ఈ ప‌రిణామంతో చాలా హుషారుగా క‌నిపిస్తోంది. బీజేపీ నాయ‌కులంతా సంబ‌రాల మూడ్‌లో ఉన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వానికి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిందంటూ కౌంట‌ర్లు వేస్తున్నారు. ఐతే కేసు సీబీఐ చేతికి వెళ్తే ఎందుకింత సంబ‌రం అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా బీజేపీ అగ్ర‌నేత కిష‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. మంచి పాయింట్లు ప‌ట్టుకుని ఆయ‌న కిష‌న్ రెడ్డిని ఏకి ప‌డేశారు. వ‌రుస‌బెట్టి కేటీఆర్ వేసిన ట్వీట్లు ఎలా ఉన్నాయో ఒక‌సారి చూడండి..

కిషన్ రెడ్డి గారూ! మీకో సూటి ప్రశ్న.ఆ సాములతో అసలు సంబంధమే లేదన్నోళ్లు…ఈ స్కాము సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరు? మీ బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే.. మీ వెన్నులో వణుకు మొదలైంది అప్పుడు భుజాలు తడుముకున్న మీరు.. ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారు?

మీకు ఏ సంబంధం లేకపోతే పలుమార్లు కోర్టుల్లో ఈ కేసు దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు కిషన్ రెడ్డి గారు? మీ Modi జేబు సంస్థ చేతికి కేసు చిక్కినందుకేనా.. ఈ పట్టలేనంత సంతోషం..?

ఒకప్పుడు సిబిఐ కి కేసు ఇస్తే నిందితులు భయపడే పరిస్థితి నుండి ఇవ్వాళ సిబిఐ కి కేసు అప్పజెప్తే మీరు సంబరాలు చేసుకుంటున్నారు అంటేనే ఆ సంస్థను మీ హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుంది.

కెమెరాల సాక్షిగా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిన దొంగలు మీరు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఉంది మీ వ్యవహారం!
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో మీరు కాంగ్రెస్ నే మించిపోయారు.

ఒకప్పుడు సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే వాళ్లు. ఇప్పుడు సీబీఐని, కంట్రోల్డ్  బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. సీబీఐ దర్యాప్తుతోపాటు... దొరికిన దొంగలపై, బీజేపీ బ్రోకర్స్ పై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమా ? మీరు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయగలరేమో గానీ.. శాస్త్రీయ పరీక్షలు (సైంటిఫిక్ టెస్టు) లను ఎవరూ మార్చలేరు. ఏమార్చలేరు.
మా సవాల్ స్వీకరించే దమ్ముందా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News