పోటుగాళ్లైతే....ర‌మ్మంటున్న త‌ల‌సాని!

Update: 2016-12-10 19:28 GMT
సుదీర్ఘ కాలం త‌ర్వాత మీడియాతో మాట్లాడిన తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. అదే స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన స‌వాల్ విసిరారు. రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో విపక్ష నేతలు మతిలేకుండా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన మరవరాదని, ఆ క్ర‌మంలో ప‌నిచేసుకుంటూ పోతున్న స‌ర్కారుపై విమ‌ర్శ‌లు మంచిది కాద‌ని త‌ల‌సాని అన్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల నిర్మించిన కొత్త క్యాంప్ ఆఫీస్ ప్రభుత్వ ఆస్తే త‌ప్పించి వ్యక్తిగతం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్వామీజీలను పిలవడంలో తప్పులేదన్నారు. దోచేసిన దొంగలా తమ గురించి మాట్లాడేది అని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. పోటుగాళ్లైతే రండి.. అసెంబ్లీలో తేల్చుకుందామని, మీరేం చేశారో.. మేమేం చేశామే తేలుతుందని మంత్రి సవాల్ విసిరారు. జీహెచ్‌ఎంసీలో వందకోట్ల అవినీతి అని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని త‌ల‌సాని దుయ్యబట్టారు. అవినీతి ఎక్కడ జరిగిందో చూపించాలని మంత్రి సవాలు విసిరారు. ఊ అంటే ఈ అంటే అవినీతి, అక్రమాలు మాటలు తప్పితే ప్రజా సంక్షేమం పట్టదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల వంటి దిక్కుమాలిన అలవాట్లు తమకెందుకుంటాయని త‌ల‌సాని వ్యాఖ్యానించారు.  రాష్ట్రాభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతతో ఉన్నట్లు త‌ల‌సాని వివ‌రించారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అని పేర్కొంటూ ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారన్నారు. తాము ఎవరికీ వత్తాసు పలకడం లేదని మంత్రి తలసాని తేల్చిచెప్పారు.

ఇదిలాఉండ‌గా తలసానిని మంత్రి పదవి నుంచి తప్పించాలని మర్రిశశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. త‌ల‌సాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఐడిహెచ్ కాలనీ డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో మంత్రి తలసాని ప్రోద్బలంతోనే అక్రమాలు జరిగాయని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. తాను చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ విచారణ జరిపించారని ఈ క్ర‌మంలో నిజాలు తేలాయ‌ని మ‌ర్రి అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపైనే కాదు, ప్రోత్సహించిన తలసానిపైనా చర్యలు తీసుకోవాలని ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించాల‌ని మ‌ర్రి డిమాండ్ చేశారు.
Tags:    

Similar News