తలసాని సంచలనం... బాబు బిక్షమెత్తడం ఏంటండీ?

Update: 2020-01-16 07:11 GMT
తెలంగాణ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త తలసాని శ్రీనివాస యాదవ్ మరోమారు టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా చంద్రబాబుపై తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన తలసాని.. బాబుకు రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మాటను మొన్న మరోమారు గుర్తు చేసిన తలసాని... తాను చెప్పినట్లుగానే బాబుకు మంచి గిఫ్టే ఇచ్చామని తెలిపారు. తాజాగా సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వచ్చిన తలసాని.... అక్కడ జరుగుతున్న కోడి పందేల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా తలసాని... చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమంలో చంద్రబాబు అనవసరంగా తలదూర్చి ఉద్యమాన్నే నాశనం చేశారని తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అమరావతిని సింగపూర్‌ చేస్తానని బాహుబలి సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్‌లతో చంద్రబాబు ప్రభుత్వం.. టెంపరరీ బిల్డింగులు చూపించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం కారణంగానే ఇప్పుడు ఏపీలో రాజధాని సమస్య ఏర్పడిందన్నారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం తప్పు చేస్తే బాధ్యత కలిగిన విపక్షంగా సలహాలు ఇవ్వాలి గానీ, ప్రజా తీర్పుకు వెళ్దామని చంద్రబాబు సవాల్ చేయడం సిగ్గుచేటంటూ తలసాని ఎద్దేవా చేశారు.

రాజధాని కోసం అమరావతిలోని రైతులు యుద్ధం చేయడానికి చంద్రబాబు నాయుడు బిక్షం ఎత్తుకోవడం ఏంటని తలసాని తనదైన శైలి ప్రశ్న సంధించారు. అమరావతిలో ప్రజలు చేసే ఉద్యమంలో.. చంద్రబాబు ఎంటరై మొత్తం ఉద్యమాన్నే నాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని రైతులకు ఉద్యమం చేసే సత్తా ఉందని పేర్కొన్న తలసాని.. అక్కడి ప్రజలకు ప్రభుత్వమే పరిష్కారం చూపుతుందన్నారు చెప్పుకొచ్చారు. చంద్రబాబు కట్టిన టెంపరరీ బిల్డింగుల కారణంగానే ఇప్పుడు ఏపీలో రాజధాని సమస్య ఉత్పన్నమైందని కూడా తలసాని వ్యాఖ్యానించారు. రాజధానిపై సీఎంగా చంద్రబాబు పకడ్బందీ చర్యలు తీసుకుని ఉంటే... ఇప్పుడు రాజధాని సమస్య ఉత్పన్నమయ్యేదే కాదని కూడా తలసాని వ్యాఖ్యానించడం సంచలనమేనని చెప్పక తప్పదు.


Tags:    

Similar News