మ‌రీ.. అంత దూకుడా త‌ల‌సాని..?

Update: 2015-08-20 11:17 GMT
ఒక‌రికి మించి మ‌రొక‌ర‌న్న‌ట్లుగా ఉంది రాజకీయ నాయ‌కుల ప‌రిస్థితి. త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేనొక‌టంటా? అంటూ అన్న నానుడికి మించి క‌ర్ర‌తో నువ్వొక‌టిస్తే.. సుత్తితో నేనొక‌టిస్తా అన్న‌ట్లుగా ప్ర‌స్తుత రాజ‌కీయం త‌యారైంది.

అధికార‌ప‌క్షం మీద విప‌క్షాలు.. విప‌క్షం మీద అధికార‌ప‌క్షాలు ముందు వెనుకా చూసుకోకుండా మాట్లాడేయ‌టం ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువైంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వ్యాఖ్య‌లు చూస్తే ఈ విధంగానే ఉన్నాయి. ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్య‌క్ర‌మాలకు అడ్డు ప‌డితే కాంగ్రెస్ నేత‌ల్ని జైల్లో వేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.
కాంగ్రెస్ ప్ర‌భుత్వాల హ‌యాంలో ఇందిర‌మ్మ ఇళ్లు క‌ట్ట‌కుండానే బిల్లులు తీసుకున్నార‌ని.. అవినీతికి భారీగా పాల్ప‌డ్డార‌ని.. అలాంటి వారిని జైల్లో వేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ప్రాజెక్టుల్ని రీడిజైన్ చేస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించినత‌ల‌సాని.. రీడిజైన్లు చేస్తే కోట్ల రూపాయిల అవినీతికి పాల్ప‌డిన‌ట్లా అని కాంగ్రెస్ నేత‌ల్ని నిల‌దీశారు.
ప్రాజెక్టుల రీడిజైనింగ్ వ్య‌వ‌హారం మీద పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. మంత్రి స్థాయిలో ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యానించే క‌న్నా.. ప్ర‌భుత్వం ముంద‌స్తుగా అఖిల‌ప‌క్షం నిర్వ‌హించి.. తాము ఏమ‌నుకుంటున్నామో చెబితే ఇలాంటివేమీ ఉండ‌వు క‌దా. అయినా.. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో అంత విశాల హృద‌యం పాల‌క‌ప‌క్షానికి ఉంటుంద‌ని ఆశించ‌గ‌ల‌మా?

విప‌క్షాల్ని విమ‌ర్శించ‌టం త‌ప్పు కాదు కానీ.. బెదిరింపు ధోర‌ణిలో మాట్లాడ‌టం.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు అడ్డుప‌డితే జైల్లో వేస్తామ‌న‌టం లాంటి దూకుడు మాట‌లు మంత్రి త‌ల‌సాని త‌గ్గిస్తే బాగుంటుందేమో. అధికారం ఎప్పుడూ శాశ్వితం కాద‌న్న విష‌యం సుదీర్ఘ‌కాలంగా విప‌క్షంలో ఉన్న ఆయ‌న మ‌ర్చిపోయిన‌ట్లున్నారు.
Tags:    

Similar News