ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ తలసాని వార్నింగ్

Update: 2019-12-29 04:36 GMT
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదనటమే కాదు.. ఒళ్లు దగ్గర పెట్టుకో అంటూ ఆగ్రహించిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అభాండాలు మోపటం సరికాదన్న తలసాని.. ఎంపీ కమ్ టీ కాంగ్రెస్ సారధి ఉత్తమ్ పై విరుచుకుపడ్డారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ కమిషనర్ గా పని చేస్తున్న అంజన్ కుమార్ మీద ఆరోపణలు సంధించటం సరికాదన్నారు తలసాని. పోలీసు శాఖపై లేనిపోని ఆరోపణలు చేయటం ఉత్తమ్ లాంటి నేతలకు తగదన్న తలసాని.. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. క్రమశిక్షణ కలిగిన ఆర్మీలో పని చేసిన ఉత్తమ్ లాంటోళ్లు.. పోలీసు ఉన్నతాధికారి మీద ఆరోపణలు చేయటం సరికాదన్నారు.

అనుమతులు ఇస్తే మంచి అధికారి.. అనుమతులు ఇవ్వకుంటే అవినీతి అధికారి అంటూ గగ్గోలు పెట్టటం ఏమిటన్న తలసాని.. ప్రభుత్వ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యానించటం మంచిపద్దతి కాదన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న అంజన్ కుమార్ ను తప్పు పట్టిన ఉత్తమ్ గతాన్ని మర్చిపోకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పలు కార్యక్రమాలకు అంజన్ అనుమతి ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటానికి వీలుగా భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు ఉత్తమ్. ఇందుకు అవసరమైన అనుమతులు తీసుకునేందుకు వీలుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కోరగా.. ఆయన అనుమతి నిరాకరించారు. దీంతో.. ఉత్తమ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ గా మంత్రి తలసాని స్పందించి ఉత్తమ్ కు ఘాటు కౌంటర్ ఇవ్వటంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం షురూ అయ్యిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News