ఆ ఫామ్ హౌస్ ను కేటీఆర్ లీజుకు తీసుకున్నారా?

Update: 2020-03-08 04:34 GMT
హైదరాబాద్ శివారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. రానున్న రోజుల్లో హైదరాబాద్ విస్తరించేది.. నయా భాగ్యనగరి ఆవిష్కరణ నార్సింగ్..కోకాపేట.. పరిధిలోనే జరగనుంది. గండిపేట చెరువుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ మరో స్థాయికి ఎదగనుందన్న అంచనాల వేళ.. అనూహ్యంగా అక్కడే మంత్రి కేటీఆర్ కు చెందిన భారీ ఫాంహౌస్ ఉందంటూ బాంబు పేల్చారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. గుట్టుచప్పుడు కాకుండా ఎప్పుడు కట్టుకున్నారో కానీ.. కేటీఆర్ ఫామ్ హౌస్ వైభోగమే వైభవం అన్నట్లుగా ఫాంహౌస్ కు సంబంధించి బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు కలకలం రేపుతున్నాయి.

విపక్ష నేతల మాటల్లోనే కానీ.. సదరు ఫామ్ హౌస్ మంత్రి కేటీఆర్ దా? కాదా? అన్న విషయం మీదా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయాన్ని తమ నిఘా విభాగంతో పరిశోధన చేసే సాహసాన్ని ఏ మీడియా సంస్థ ప్రదర్శించలేదు. ఇలాంటివేళ.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరయ్య తదితరులు కలిసి..కేటీఆర్ ఫాంహౌస్ గా చెప్పే ప్రాంతానికి వెళ్లి ఆందోళన చేయటం ఒక ఎత్తు అయితే.. డ్రోన్ ప్రయోగించి.. అక్కడి అంశాల్ని రికార్డు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

డ్రోన్ ప్రయోగానికి మూల్యం చెల్లిస్తూ రేవంత్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మంత్రి తలసాని కేటీఆర్ ఫాంహౌస్ గా చెప్పే భవనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్ఎస్ నేతలు ఎవరూ చేయని ధైర్యాన్ని.. సాహసాన్ని తలసాని ప్రదర్శించారని చెప్పాలి. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన.. మంత్రి కేటీఆర్ జీవో 111ను ఉల్లంఘించినట్లుగా చెప్పటం సరికాదన్నారు.

సదరు ఫాంహౌస్ ను మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న కొత్త విషయాన్ని ఆయన వెల్లడించారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న తర్వాత ఎలాంటి నిర్మాణాలు జరగలేదన్న సర్టిఫికేట్ ఇచ్చేశారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారన్న రేవంత్ మాటలు సరికావని తలసాని తేల్చేశారు. ఇప్పటివరకూ కేటీఆర్ ఫాంహౌస్ అవునో? కాదో? అన్న సందేహంలో ఉన్న వారి కన్ఫ్యూజన్ తీర్చేయటమే కాదు.. దాని గురించి మాట్లాడిన మంత్రి తలసాని దమ్మును మెచ్చుకోవాల్సిందే.
Tags:    

Similar News