జగన్ తో సినీ పెద్దల భేటీపై స్పందించిన తలసాని

Update: 2020-02-27 12:39 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. హుద్ హుద్ తుఫాను సమయంలో ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులైన వారికి ప్లాట్లు కట్టించి ఇవ్వాలని సంకల్పించినట్లు  జగన్ కు నిర్మాత డి.సురేష్ బాబు - శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. హుద్ హుద్ తుఫాన్ తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులంతా కలిసి రెండు రోజుల పాటు నిర్వహించిన  షో ల ద్వారా 15 కోట్ల రూపాయల విరాళాలు సేకరించామని ఆ డబ్బుతో విశాఖలోని మధురవాడ దగ్గర 320 సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్లు నిర్మించామని తెలిపారు. ఈ ప్లాట్లను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. తాను త్వరలోనే విశాఖలో పర్యటించబోతున్నానని - ఆ సమయంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించాలని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు భేటీపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సీఎంతో సినీపెద్దల భేటీ మంచి పరిణామమని అన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన తలసాని మీడియాతో ముచ్చటించారు.

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్  మీడియాతో ముచ్చటించారు. ఏపీలో సీఎం జగన్ పాలన - తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తలసాని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాలని తలసాని అన్నారు. ప్రభుత్వం పై బురదజల్లడమే ప్రతిపక్షాల పని అని, ప్రతిపక్షాలను పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని తలసాని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలకు ప్రజలు అఖండ మెజారిటీని కట్టబెట్టారని, ప్రభుత్వానికి ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల విషయం ఏపీ కి సంబంధించిన వ్యవహారమని తలసాని అభిప్రాయపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన ఓటమి ఖాయం అయిన సంగతి చంద్రబాబుకు తెలిసిపోయిందని అందుకే అప్పటి నుంచి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తలసాని ఎద్దేవా చేశారు.

కాగా, ఏపీ సీఎంగా వైస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు పెద్దగా కలవలేదని విమర్శలు వచ్చాయి సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదల తర్వాత మెగాస్టార్ చిరంజీవి జగన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కూడా అడపాదడపా ఒకరూ ఇద్దరూ టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ ను కలిసినప్పటికీ.... మెజారిటీ సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలవలేదని విమర్శలు వచ్చాయి. కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్న ఒక బలమైన సామాజిక వర్గం వారు సీఎం జగన్ ను కలిసేందుకు పెద్దగా ఇష్టపడటం లేదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖలోని ప్లాట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ ను సినీ ప్రముఖులు ఆహ్వానించటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Tags:    

Similar News