కేంద్రం స‌డ‌లింపుల‌పై తెలంగాణ మంత్రి అస‌హ‌నం!

Update: 2020-04-30 11:50 GMT
లాక్‌ డౌన్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇంకొన్నాళ్లు ఓపిక ప‌డితే క‌రోనా మ‌హ‌మ్మారి జాడ లేకుండాపోతుంద‌ని అంద‌రూ భావిస్తుండ‌గా అక‌స్మాత్తుగా బుధ‌వారం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది. కూలీలు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌పై తెలంగాణ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వడాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఎందుకంటే కేంద్రం సడలింపుల ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకుంద‌ని.. కూలీల త‌ర‌లింపున‌కు స‌రైన ఆదేశాలు జారీ చేయ‌లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది. తాజాగా ఈ స‌డ‌లింపుల‌పై గురువారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్పందించారు.

కేంద్రం వలస కార్మికుల తరలింపున‌కు అనుమ‌తి ఇచ్చింది.. స‌రే కానీ వారిని త‌ర‌లించేందుకు ర‌వాణా సౌక‌ర్యం ఏమిట‌ని చెప్ప‌లేద‌ని మంత్రి తెలిపారు. ఈ క్ర‌మంలో వ‌లస కూలీల త‌ర‌లింపున‌కు ఉచితంగా రైళ్ల‌ను న‌డ‌పాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సూచించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సుల్లో వ‌ల‌స కూలీల‌ను తరలించాలని నిర్ణయించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 15 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని మంత్రి తెలిపారు. కేంద్రం చెప్పిన ప్ర‌కారం కూలీల‌ను బ‌స్సుల్లో త‌ర‌లించాలంటే బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గడ్‌కు‌ బస్సుల్లో వెళ్లేందుకు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుందని వివ‌రించారు. ఇది కూలీలకు చాలా ఇబ్బందికరమైన ప్రయాణమని పేర్కొన్నారు. రైళ్ల‌లో వలస కూలీలను వారి స్వరాష్ట్రాలకు చేర్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా బస్సులతో స్వగ్రామాలకు తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని చెప్పారు.

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన భక్తులు, పర్యాటకులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించింది. ఈ క్ర‌మంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, -ఉత్తరాఖండ్ - గుజరాత్ - పంజాబ్ - అస్సాం - రాజస్తాన్ - ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాలు ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ విద్యార్థులు - పర్యాటకులను వెనక్కు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేశాయి. కేంద్రం స‌డ‌లింపుపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతున్నా.. దానిపై స్ప‌ష్ట‌త క‌రువైంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News