అమ్మ ఉంటే ఆయన్ను టచ్ చేయలేకపోయేవారా?

Update: 2016-12-27 08:05 GMT
అక్రమాస్తులు - నల్లధనం కేసుల్లో చిక్కుకున్న తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహనరావు ఎదురు తిరుగుతున్నట్లుగా  కనిపిస్తున్నారు.  భారీగా ఆస్తులతో అడ్డంగా బుక్కయిపోయినా కూడా ఆయన రివర్స్ అవుతున్నారు. తాను అమ్మ జయలలిత రిక్రూట్ చేసిన మనిషినని... తనను ఎవరూ పదవిలోంచి తొలగించలేరని... ఇప్పటికీ తానే సీఎస్ నని అంటున్నారు. అంతేకాదు... అమ్మే కనుక ఉంటే తనను టచ్ చేసే ధైర్యం ఎవరికీ ఉండేది కాదని.. తన ఇంట్లో ఈ అధికారులెవరూ అడుగుపెట్టేవారు కాదని అంటున్నారు.
    
దివంగత ముఖ్యమంత్రి జయలలిత చీఫ్ సెక్రటరీ పదవికి ఎంపిక చేశారని - ఆమే బతికుంటే - అత్యంత రహస్యమైన దస్త్రాలు - పరిపాలనా నిర్ణయాలకు సంబంధించిన కాగితాలు ఉండే సెక్రటేరియేట్ లోకి - సీఎస్ చాంబర్ లోకి సీఆర్పీఎఫ్ దళాలు - ఆదాయపు పన్ను శాఖ అధికారులు వచ్చేంత ధైర్యం చేసేవారా? అని రామ్మోహన్ రావు నిప్పులు చెరిగారు.  ఆయన ఇంటిపై ఐటీ రైడ్ తరువాత గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈరోజు డిశ్చార్జి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... అమ్మ మరణంతో రాష్ట్రం అనాధగా మారిపోయిందని, సాక్ష్యాత్తూ, చీఫ్ సెక్రటరీపై కుట్ర జరుగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని, కేంద్రానికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సీఆర్పీఎఫ్ దళాలు తన బెడ్ రూములోకి - కార్యాలయంలోకి ప్రవేశించించేందుకు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వారెంటు లేకుండా తన ఇంటిలో సోదాలు చేశారని రామ్మోహన్ రావు అన్నారు.
    
సెర్చ్ వారెంట్ లో తన పేరు లేదని..  తన ఇంట్లో 1,12,320 రూపాయలు మాత్రమే పట్టుకున్నారని ఆయన తెలిపారు. తన కుమార్తె - భార్యలకు చెందిన 40 తులాల బంగారం - 25 కేజీల దేవుళ్ల విగ్రహాలు తీసుకున్నారని అన్నారు.  తన హక్కులకు భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. 32 ఏళ్ల పాటు సర్వీసు చేసిన తనకే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. తాను శేఖరరెడ్డికి సంబంధించిన ఏ లావాదేవీలోనూ కల్పించుకోలేదని అన్నారు. తన కుమారుడికి అతనితో వ్యాపారలావాదేవీలు లేవని, విట్ నెస్ సైన్ మాత్రమే చేశాడని ఆయన తెలిపారు. అది కనీసం ష్యూరిటీ కూడా కాదని ఆయన తెలిపారు.
    
దివంగత సీఎం జయలలితపై పొగడ్తల వర్షం గుప్పిస్తూ, తనకు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమె లేకపోవడం వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, ప్రజలకు సంక్షేమం దూరమైందని ఆరోపించారు. తన విషయంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు.  తనకు పట్టిన ఈ గతిని చూసి, ఇతర ఐఏఎస్ అధికారులు ఆందోళన చెందుతున్నారంటూ వారినీ ఇందులోకి లాగే ప్రయత్నం చేశారు. తనకేదైనా జరిగితే, అందుకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News