దొంగిలించిన‌ క‌థ..'స‌ర్కార్' పై బీజేపీ విమ‌ర్శ‌లు!

Update: 2018-11-06 08:51 GMT
ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ - ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ ల కాంబోలో తెర‌కెక్కిన `స‌ర్కార్` చిత్రం నేడు భారీ స్థాయిలో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర క‌థ త‌న‌దంటూ ఓ ర‌చ‌యిత ఆరోపించ‌డం...టైటిల్ కార్డ్స్ లో ఆ ర‌చ‌యిత పేరు వేసేందుకు మురుగ‌దాస్ అంగీరించ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా స‌ర్కార్ చిత్రంపై బీజేపీ త‌మిళ‌నాడు అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌ రాజన్‌ విమర్శ‌లు గుప్పించారు. దొంగిలించిన కథతో దొంగ ఓట్ల గురించి సినిమా తీస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు. నటుడు విజయ్‌పై దాడి చేయాలన్నది ఉద్దేశం కాదంటూనే....దొంగ క‌థ‌తో దొంగ ఓట్ల గురించి సినిమా ఎలా తీశార‌ని ఆమె ప్ర‌శ్నించారు. త‌మిళ‌నాట రాజ‌కీయ ప‌రిస్థితిని బాగు చేసేందుకు న‌టులెవ‌రూ రాన‌వ‌స‌రం లేద‌ని క‌మ‌ల్ - ర‌జ‌నీల‌పై కూడా ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

విజ‌య్ న‌టించిన `మెర్స‌ల్‌`లో జీఎస్టీపై అభ్యంత‌ర‌క‌ర డైలాగులున్నాయంటూ బీజేపీ విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రంపై పెనుదుమారం రేగింది. తాజాగా, మ‌రోసారి ప‌రోక్షంగా విజ‌య్ సినిమాను బీజేపీ టార్గెట్ చేసింది. కొంద‌రు వ్య‌క్తులు సినిమాల్లో నటించి ఇప్పిటికిపుడు ముఖ్యమంత్రి అయిపోదామని బయలుదేరారని తమిళిసై సౌందర్‌రాజన్‌ విమర్శించారు. వారు సినిమాల్లో ముఖ్య మంత్రులు కావచ్చ‌ని, కానీ, నిజ జీవితంలో మోదీ భుజం తట్టిన వారే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. త‌మిళ‌నాట‌ రాజకీయ‌ పరిస్థితి బాగానే ఉందని, నటులెవరూ బాగు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. త‌మిళ‌నాట మార్పు బీజేపీతోనే సాధ్య‌మ‌ని, బీజేపీ మంచి సర్కార్‌ అని,  దొంగిలించిన కథతో దొంగ ఓట్ల గురించి చిత్రం తీయ‌డం ఏమిట‌ని ఆమె అన్నారు.


Tags:    

Similar News