త‌మిళ‌నాట తాయిలాలు.. ఓట్లు రాలుతాయా..?

Update: 2021-03-14 13:30 GMT
దేశంలో త‌మిళ రాజ‌కీయం కాస్త భిన్నంగా సాగుతుంది. ఎన్నిక‌ల వేళ ఓట్లు కొల్ల‌గొట్టేందుకు రాజ‌కీయ పార్టీలు ఎంత దూర‌మైనా వెళ్తాయి. ఎలాంటి హామీలైనా ఇచ్చేస్తాయి. ఒక‌రి హామీ జ‌నాల‌ను ఆక‌ర్షించేలా ఉందంటే.. మ‌రోపార్టీ అంత‌కు మించి ప్ర‌క‌టిస్తుంది. ఇలాంటి వాటికి గ‌తంలో బోలెడు ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి హ‌యాంలో ప్ర‌జ‌ల ఓట్ల‌ను గంప‌గుత్త‌గా ప‌డేసేందుకు ఎన్నెన్నో హామీలు గుప్పించేవారు.

ఇప్పుడు కూడా పార్టీలు ఉచిత ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ప్ర‌జ‌ల‌పై అధిక భారం మోపుతున్న అంశాలు ఏవైనా ఉన్నాయంటే.. అవి పెట్రో ధ‌ర‌లు, వంట గ్యాస్ రేట్లు. వీటి‌ ధ‌ర‌లు ఇష్టారీతిన పెరుగుతున్నా.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌ట్ల‌ద‌నే విమ‌ర్శ‌లు దేశ‌వ్యాప్తంగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దీన్నే అస్త్రంగా ప్ర‌యోగించారు డీఎంకే అధినేత స్టాలిన్‌.

ఈ ఎన్నిక‌ల్లో తాము గెలిస్తే.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై 5 రూపాయ‌ల రిబేటు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతోపాటు గ్యాస్ సిలిండ‌ర్ పై రూ.100 రాయితీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఈ హామీ.. సంచ‌ల‌నంగా మారింది. చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న ఇష్యూను డీఎంకే ఒడిసిప‌ట్ట‌డంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

మ‌రి, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తున్న‌దే ప్ర‌శ్న‌. అన్నాడీఎంకేతో క‌లిసి త‌మిళ‌నాట పాగావేయాల‌ని చూస్తున్న క‌మ‌ల‌ద‌ళం.. దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఒక‌వేళ తాము అంత‌కు మించి ఇస్తామంటే.. ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోయే మిగిలిన ప్రాంతాల్లోనూ ప్ర‌క‌టించాల్సి వ‌స్తుంది. మ‌రి, దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందోన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.
Tags:    

Similar News