త‌మిళ ర‌ణ‌క్షేత్రంలో ఆళ‌గిరి అడ్ర‌స్ ఎక్క‌డ ?

Update: 2021-04-03 17:30 GMT
తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎవ‌రికి వారు వార్త‌ల్లో నిలుస్తున్నారు. స్టాలిన్‌, ఉద‌య‌నిధి స్టాలిన్‌, చిన్న‌మ్మ‌, దిన‌క‌ర‌న్‌, ప‌ళ‌నిస్వామి, ప‌న్నీరు సెల్వం, ఇటు బీజేపీ నుంచి ఖ‌ష్బూ, గౌత‌మి, కాంగ్రెస్ నుంచి కొంద‌రు నేత‌లు, చివ‌ర‌కు క‌మ్యూనిస్టులు.. అటు క‌మ‌ల్‌హాస‌న్‌, విజ‌య్‌కాంత్ నుంచి చివ‌ర‌కు పార్టీ పెడ‌తాన‌ని వెన‌క్కు త‌గ్గిన ర‌జ‌నీకాంత్ సైతం రాజ‌కీయ వార్త‌ల్లో ఉంటున్నారు. అయితే రెండేళ్లుగా త‌మిళ రాజ‌కీయాల్లో.. ముఖ్యంగా డీఎంకేలో పెద్ద అల‌జ‌డిగా మారిన ఆళ‌గిరి అడ్ర‌స్ ఎక్క‌డ అన్న‌ది మాత్రం తేల‌డం లేదు. క‌రుణానిధి కుమారుడు కావ‌డంతో ఆయ‌న అడుగులు ఎలా ఉంటాయో ? ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. క‌రుణానిధి జీవించి ఉండ‌గానే ఆళ‌గిరిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఆ త‌ర్వాత స్టాలిన్ కూడా ఆయ‌న్ను పార్టీలో చేర్చుకోలేదు.

డీఎంకేకు దూరంగా ఉన్న ఆయ‌న ఆ త‌ర్వాత కొత్త పార్టీ పెడ‌తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పెట్టే పార్టీలో చేర‌తార‌ని కూడా అంద‌రూ అనుకున్నారు. అవేవి జ‌ర‌గ‌లేదు. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల వేళ ఆళ‌గిరి ఎటు మొగ్గు చూపుతార‌న్న‌ది అర్థం కావ‌డం లేదు. మ‌ధురై జిల్లాల్లో ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉండడంతో పాటు సొంత వ‌ర్గం ఉంది. ఈ వ‌ర్గం అక్క‌డ ఖ‌చ్చితంగా గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌నుంది. కొద్ది రోజుల క్రితం ఆళ‌గిరి మ‌ద్ద‌తు దారులు చెన్నైలో భారీ ర్యాలీ చేసిన‌ప్పుడు ఆయ‌న క‌ళైంజ‌ర్ డీఎంకే పార్టీ పెడ‌తారంటూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్ట‌ర్లు వేశారు.

ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఇప్పుడు ఆళ‌గిరి సొంత పార్టీ పెట్టినా ఉప‌యోగం ఉండ‌దు. ఆయ‌న ఎవ‌రికి అయినా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని చెప్పినా కూడా త‌మిళ జ‌నాలు వినే ప‌రిస్థితి లేద‌న్న చ‌ర్చ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి. ఇక ఆయ‌న ప్ర‌భావం మ‌ధురైతో పాటు దక్షిణ జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్ర‌మే ఉంది. అయితే ఆళ‌గిరి రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో ఆయ‌న వ‌ర్గం కూడా త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీల‌లో చేరిపోయింది. దీంతో ఇప్పుడు ఆయ‌న్ను ప‌ట్టించుకునే వారే లేకుండా పోయారు.
Tags:    

Similar News