ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా నేత ఏంది ప‌వ‌న్‌?

Update: 2017-08-06 04:06 GMT
జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ సినీ నిర్మాత.. ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. రాజ‌కీయంగా ప‌వ‌న్ ను ఇప్ప‌టివ‌ర‌కూ త‌ప్పు ప‌ట్ట‌ని కోణాన్ని తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. ప‌వ‌న్ వైఖ‌రిని సూటిగా ప్ర‌శ్నించిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింద‌ని చెప్పాలి. పాద‌యాత్ర చేసే విష‌యంలో ప‌వ‌న్ త‌న‌కున్న సందేహాల్ని ఇటీవ‌ల నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించ‌టం తెలిసిందే.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన త‌మ్మారెడ్డి..ఒక మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నేమ‌న్నారన్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

= రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌మ‌స్య వ‌స్తుంద‌ని ఇంట్లో కూర్చోలేం క‌దా?  రాజ‌కీయాల్లోకి రావ‌టం అంటే ప్ర‌జ‌ల్లోకి రావ‌టం. ప్ర‌జ‌ల్లోకి రావ‌టం అంటే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రావ‌ట‌మే అవుతుంది. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జ‌నంలోకి వ‌స్తే.. ఇబ్బందులు ప‌డ‌తామని చెప్ప‌టం క‌రెక్ట్ కాదు. జ‌నంలోకి వ‌చ్చి సాల్వ్ చేయాలి. జ‌నంలోకి రాకుండా ఇంట్లో కూర్చుంటే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎలా తెలుస్తాయి?  ఎవ‌రో చెప్పాలి. చెప్పే వాళ్లు స‌రిగా చెబుతారా? గ‌్యారెంటీ ఏంటి? న‌మ్మ‌కం ఏంటి?

= సెక్యూరిటీ రీజ‌న్స్ అంటే ఏమిటి?  మొన్న‌టి వైజాగ్ టూర్ తీసుకుందాం. ఆయ‌న వైజాగ్ వెళ‌తారు కాబ‌ట్టి.. అక్క‌డి చుట్టుప‌క్క‌ల వారంతా వైజాగ్‌కు వ‌స్తారు. ప‌వ‌న్ వైజాగ్ లోనే ఉంటారు కాబ‌ట్టి.. ప‌వ‌న్ ను చూడాల‌నుకున్న ఆ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల వారంతా కూడా వ‌చ్చారు. అదే ప‌వ‌న్ క‌ల్యాణ్ వైజాగ్ లో మొద‌లుపెట్టి విజ‌య‌న‌గ‌రం మీదుగా శ్రీకాకుళం వ‌ర‌కూ వెళ‌తారని చెప్పార‌నుకోండి.  అప్పుడు ఏ ఊరి జ‌నం ఆ ఊరిలోనే ఉంటారు క‌దా? ఇప్పుడు వ‌చ్చిన‌న్ని మోటార్ సైకిళ్లు అప్పుడు రావు. మొన్న ప‌దివేల మోటారు సైకిళ్లు వ‌చ్చాయ‌నుకుందాం. ఇలా చేస్తే రెండువేల మోటారు సైకిళ్లు వ‌స్తాయి. జ‌నం రార‌ని చెప్ప‌టం లేదు. కాకుంటే.. అంత ఎక్కువ‌గా రావు.

= ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు నెంబ‌రు వ‌న్ స్టార్‌. ఆయ‌న‌కు జ‌నం రార‌నుకోవ‌టం త‌ప్పు. జ‌నం వ‌స్తారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. చంద్ర‌బాబులు పాద‌యాత్ర‌లు చేశారు. వారు పాద‌యాత్ర‌లు వంద రోజులు చేశార‌నుకుందాం. ఈయ‌న‌కు 125 రోజులు అవ్వొచ్చు. ఎందుకంటే జ‌నం ఎక్కువ‌మంది వ‌స్తారు. అడ్డుప‌డ‌తారు.. స‌మ‌స్య‌లు చెబుతారు కాబ‌ట్టి.

= వ‌చ్చే వాళ్ల‌ల్లో అభిమానంతో వ‌చ్చేవాళ్లు ఉంటారు. సినిమా పిచ్చోళ్లు ఉంటారు. స‌మ‌స్య‌లు చెప్పుకునే వాళ్లు ఉంటారు. ఈయ‌న్ని న‌మ్మి వ‌చ్చే వాళ్లు ఉంటారు. ఈయ‌న ఇప్పుడు వెళ్లేది ఈయ‌న్ను న‌మ్మే వాళ్ల కోసమే కానీ ఫ్యాన్స్ కోసం కాదు. ఫ్యాన్స్ ను ఉద్ద‌రించ‌టానికి కాదు క‌దా ఈయ‌న పాలిటిక్స్ లోకి వ‌చ్చింది.

= కేవ‌లం ఈయ‌న మీద న‌మ్మ‌కంతో.. ఈయ‌న ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తార‌ని న‌మ్ముకున్నోళ్లు వ‌స్తారు. ఆ న‌మ్ముకున్నోళ్లు త‌మ స‌మ‌స్య‌ల్ని నేరుగా చెప్పుకోవ‌టానికి ఎక్కువ ఇంట్ర‌స్ట్ ఉంటుంది. పవ‌న్ ప్ర‌జ‌ల్లోకి రావాలి. వారు చెప్పింది వినాలి. వింటేనే ఈయ‌న‌కు అర్థ‌మ‌వుతుంది.. అవ‌గాహ‌న వ‌స్తుంది. పుస్త‌కాలు చ‌దివో.. న‌లుగురు కూర్చొని అక్క‌డ అలా జ‌రుగుతుంద‌ట అనే మాట‌లు విని..  స‌మ‌స్య‌ను తెలుసుకున్నాన‌ని అనుకోవ‌టం అమాయ‌క‌త్వం అవుతుంది.

= రాజ‌కీయ నేత‌ల పాద‌యాత్ర‌ల‌కు.. సినిమారాజ‌కీయ నేత‌ల పాద‌యాత్ర‌ల‌కు చాలా తేడా ఉంటుంది. రాజ‌కీయ నేత‌ల యాత్ర‌ల‌ప్పుడు జ‌నాల్ని డ‌బ్బులిచ్చి తెచ్చుకునే ప‌రిస్థితి ఉంటుంది. కానీ.. ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే జ‌నాల‌కు డ‌బ్బులిచ్చి తెచ్చుకోవ‌క్క‌ర్లేదు. మ‌నం ప‌ది మంది వ‌స్తార‌నుకుంటే.. వంద‌మంది వ‌స్తారు. వంద‌మంది వ‌స్తార‌నుకునే చోట వెయ్యి మంది వ‌స్తారు.

= రాజ‌కీయ నాయ‌కుల్ని ప్ర‌జ‌లు పూర్తిగా న‌మ్మ‌రు. రాజ‌కీయ నేత‌లు వ‌చ్చిన‌ప్పుడు ప‌ద‌వుల కోస‌మో.. మ‌రే కార‌ణం కోస‌మో జ‌నాల్ని తీసుకొస్తారు. అదే ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే.. రాష్ట్రంలో కొత్త రాజ‌కీయ నాయ‌క‌త్వం రావాలి.  మార్పు వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో వ‌చ్చే వారు వ‌స్తారు. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవాల‌ని వ‌చ్చే వారు వ‌స్తారు. ఇలా వ‌చ్చిన‌ప్పుడు వారి స‌మ‌స్య‌లు తెలీటంతో పాటు.. ఈయ‌న‌కు స‌మాజం ప‌ట్ల కాస్త అవ‌గాహ‌న వ‌స్తుంది. రాష్ట్రంలో జ‌రిగేదేమిటి? అనేది తెలుస్తుంది. ఆయ‌న‌కు నిజ‌మైన అవ‌గాహ‌న వ‌చ్చే ఛాన్స్ ఉంది.  అది కాకుండా నేను నా ఆఫీసులో ఉంటానంటే.. వాళ్లు నిజం చెప్పారో? అబ‌ద్ధం చెప్పారో ఎవ‌రికి తెలుసు?

= ఇప్పుడు నేను చెప్పిందంతా క‌రెక్ట్ కాదేమో?  నా ఆలోచ‌న నేను చెబుతాను. నేను చెప్పింది క‌రెక్ట్‌.. అవ‌త‌లోడు చెప్పింది త‌ప్పు అనుకోకూడ‌దు క‌దా? అదే నేను వెళ్లి స్వ‌యంగా చూశాను అనుకోండి అది వేరుగా ఉంటుంది. అనుభ‌వించి చెప్ప‌టం వేరు.. విని చెప్ప‌టం వేరు. విని చేసే దానికి.. అనుభ‌వించి చేసే దానికి చాలా తేడా ఉంటుంది. పొలిటీషియ‌న్ అనేవాడు అనుభ‌వించి.. ప‌రిష్కారం వెతికితే బాగుంటుంది. నిజంగా అలానే చేస్తే బాగుంటుంది.

= న‌టులు రాజ‌కీయనాయ‌కులుగా మారిన త‌ర్వాత ప్ర‌జ‌ల్లో ఆరాధ‌న భావం గ‌తానికి ఇప్ప‌టికి తేడా ఉంది. అప్ప‌టి ఫ్యాన్స్ కు ఇప్ప‌టి ఫ్యాన్స్ కు సంబంధం లేదు. అప్ప‌ట్లో నిజ‌మైన ఫ్యాన్స్ ఉండేవారు. ఇప్పుడు వేలంవెర్రి ఫ్యాన్స్ మాదిరి చేస్తున్నారు. అప్ప‌ట్లో ఫ్యాన్స్ భ‌క్తిభావంతో ఉండేవారు. చెప్పిన మాట వినేవారు. ఇప్పుడు చెప్పే మాట వినే ప‌రిస్థితి లేదు. ఏదో ఫ్యాన్స్ అంటారు.. కానీ విన‌ట్లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టేట్ మెంట్ ఇచ్చారంటే .. ఆయ‌న ఫ్యాన్స్ ఆయ‌న మాట విన‌ట్లేద‌నేగా?  ఫ్యాన్స్ అంటే మీరు ఆగండి అంటే ఆగాలి. హీరో కోసం ప్రాణం ఇచ్చేవాడు ఫ్యాన్ అవుతాడు. నువ్వు నిల‌బ‌డు అంటే నిల‌బ‌డాలి. రా అంటే రావాలి. కూర్చో అంటే కూర్చోవాలి. లే అంటే లేవాలి. అది ఫ్యాన్ అంటే. అత‌నే నిజ‌మైన ఫ్యాన్ అంటే. మీరు అగండి అంటే మీద ప‌డి.. ముద్దుపెట్టి.. ఫోటో దిగి.. సెల్ఫీ దిగేవాడిని ఫ్యాన్ ఎందుకు అవుతాడు?  నిన్ను గౌర‌వించాలి.. నీ మాట‌ను గౌర‌వించాలి.. వాడు నీ ఫ్యాన్‌. అంతేకానీ మీద ప‌డిపోతున్నారంటే వాళ్లు నీ ఫ్యాన్స్ కాద‌న్న మాట‌. అలాంటి వారిని తోసేసేందుకు సెక్యూరిటీ ఉంటారు. ఆయ‌న మొద‌ట్నించి సెక్యూరిటీ లేకుండా బ‌య‌ట‌కు రారు.
Tags:    

Similar News